నీకొకటి.. నాకొకటి..

Sun,April 21, 2019 12:21 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 52 మండలాలుండగా, కొత్తగా 18 మండలాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు అర్బన్ మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, మంచిర్యాల జిల్లాలో రెండు అర్బన్ మండలాలుండగా, మిగతా 66 గ్రామీణ మండలాలుగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 18, ఆదిలాబాద్ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 గ్రామీణ మండలాలు ఉండగా, వీటిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో చాలా చోట్ల తక్కువ ఎంపీటీసీ స్థానాలుండగా, సులభంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు వీలుంది. సాధారణంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు దక్కించుకోవాలంటే ఎంపీటీసీగా గెలవడం ఒకవంతు అయితే.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను దక్కించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. క్యాంపు రాజకీయాలు నడపడంతో పాటు వ్యయ ప్రయాసాలు తప్పవు. కానీ చిన్న మండలాలు కావడం, తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో చాలా చోట్ల క్యాంపు రాజకీయాలు, వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి.

ఇద్దరు ఒక్కటైతే..
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొత్తగా ఏర్పడగా.. ఇక్కడ 3 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో ఇద్దరు ఒక్కటైతే ఒక్కరికి ఎంపీపీ, మరొకరికి వైస్ ఎంపీపీ పదవి వరించనున్నది. దీంతో ఇక్కడ క్యాంపు రాజకీయాలు అవసరం ఉండదు. ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా కీలక పదవులు దక్కించుకోవచ్చు. అయితే ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు సులభంగా దక్కుతుండడంతో.. మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎక్కువ మంది పోటీ చేసే అవకాశాలున్నాయి. కొత్తగా ఏర్పడిన చాలా మండలాల్లో తక్కువ ఎంపీటీసీ స్థానాలుండడంతో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఉండనున్నాయి. ఇక నిర్మల్ జిల్లా పెంబి, మంచిర్యాల జిల్లా భీమారం, భీమిని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్, లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో కేవలం నాలుగు చొప్పున ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ ఇద్దరే సభ్యులు ఒకవైపు ఉంటే అధ్యక్ష పదవి ఎన్నికపై పీఠముడి పడే అవకాశం ఉంది. ముగ్గురు సభ్యులు ఒకవైపు ఉంటే ఇందులో ఒక్కరికి ఎంపీపీ, మరొకరికి వైస్ ఎంపీపీ పదవి దక్కనున్నది.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్, ఆదిలాబాద్ జిల్లా తాంసి, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, వేమనపల్లి, మందమర్రిలో అయిదుగురు చొప్పున ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ ముగ్గురు ఒకవైపు ఉంటే వారికే ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు వరించనున్నాయి. ముగ్గురులోనూ ఇద్దరికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు దక్కనున్నాయి. నిర్మల్ జిల్లా బాసర, దిలావర్‌పూర్, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, సిరికొండ మండలాల్లో 6చొప్పున ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ ముగ్గురు ఒకవైపు ఉంటే ఎంపీపీ ఎన్నికపై పీఠముడి పడనున్నది. నలుగురు మద్దతుంటే ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు దక్కించుకోవచ్చు. నలుగురిలో ఇద్దరికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు వరించనున్నాయి. తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉన్న మండలాల్లో క్యాంపు రాజకీయాలు నడిపిన ఇద్దరు, ముగ్గురిని తమకు అనుకూలంగా మలుచుకొని మద్దతు తీసుకుంటే సరిపోతుంది.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles