వసంత కేళి నేడు హోళీ

Wed,March 20, 2019 01:01 AM

జైనూర్/ కెరమెరి: ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మనుషులంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చే పండుగే హోలి. రంగులను ప్రేమగా ముఖాలకు పులుముకుంటూ పెద్దలు, రంగులు నింపిన పిచికారిలతో చిన్నారులు వీధుల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. వాడవాడనా రంగురంగుల దృశ్యాలు ఆవిష్కృతమయ్యే కలర్‌ఫుల్ పండుగ ఇదేనంటే అతిశయోక్తి కాదు.
ఇదీ పురాణం..
హోలీ పుట్టుక గురించి పురాణగాథలనేకం ఉన్నాయి. హోలిక అనే రాక్షసి తాను నివసించే పరిసరాల్లోని పిల్లలను ఎత్తుకుపోయి తినేసేదట! దీంతో ఆ ప్రాంత ప్రజలంతా ఏకమై హోలికను పట్టుకుని కాల్చి, చంపారట! అలా నాటి నుంచి హోలిక పేరిట ఏటా హోలీ పండుగ జరుపుకుంటున్నారని ప్రతీతి.
కామదహనంతో మొదలు..
హోలీకి ముందు రోజు రాత్రి కామ దహనం మొదలవుతుంది. ఇది జాజిరి ఆటకు ముగింపు. చీడాపీడా తొలగి, మానవులందరికీ సర్వ సుఖాలు కలగాలని ఆశిస్తూ, ఇంట్లోని పాత వస్తువులను కూడళ్ల వద్ద దహనం చేస్తుంటారు. ఆ బూడిదను బొట్టుగా పెట్టుకొని శారీరక, మానసిక ప్రశాంతత కలగాలని వేడుకోవడం ఆనవాయితీ. ఫాల్గుణ పౌర్ణమి నాటికి ప్రకృతి ఆకుపచ్చని కోక సింగరించుకుని వసంతోత్సవానికి ముస్తాబవుతుంది. ఈ వర్ణ రంజితమైన పండుగ వెనుక మరో పురాణగాథ ఉంది. పరమేశ్వరుడికి తపోభంగం కలిగించి ప్రణయం వైపు మరల్చేందుకు ఇంద్రప్రేరితుడైన మన్మథుడు తన విరి శరాలను సంధిస్తాడు. సుమ బాణాల తాకిడికి తోడు వసంత రుతు సృష్టి కూడా జరగడంతో శివుడికి తపోభంగం కలుగుతుంది. కోపోద్రిక్తుడైన శివుడు త్రినేత్రంతో కాముడిని దహిస్తాడు. నాటి నుంచి దుఃఖ హేతువయిన కామాన్ని అణిచివేసుకోవడమనే పరమార్థ సూక్తిననుసరించి కామదహనం చేయడం, తర్వాత హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని చెబుతారు.

*మోదుగ పూలరంగు
ప్రాచీనకాలంలో రంగుల కోసం మోదుగ పూలు వాడేవారు. ఇవి చర్మానికి ఎంతో శోభ తెచ్చేవి. మోదుగపూలను ఎండబెట్టి దాని నుంచి రంగులు తయారుచేయవచ్చు. ఇది ఆరోగ్యానికి దోహదకారి మాత్రమే గాక, ఈ కాలంలో వచ్చే రోగాలకు దివ్యమైన ఔషధంలా పని చేస్తుంది. ఇలాంటి రంగులు పూసుకోవడం ద్వారా సంతోషం, ఆనందం కలుగుతాయి. అలాగాక రసాయనాలు కలిపిన రంగులు పూసుకోవడం వల్ల లేనిపోని చర్మరోగాలు అంటుకుంటాయి.

* ఇలా చేస్తే మేలు..
రసాయనాలు కలిపిన రంగులు వాడితే కళ్లకు, శరీరానికి ప్రమాదమనీ అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- సింథటిక్ రంగులు చర్మం, వెంట్రుకల్లో దీర్ఘకాలం ఉండి, రకరకాల ఎలర్జీలు, చర్మవ్యాధులకు దారితీస్తాయి.
- పొడి రసాయనాలు మంచివే అయినా నాణ్యంగా ఉంటేనే ఉపయోగించాలి.
- ఆయిల్, గ్రీజు లాంటి పదార్థాలను అస్సలు ముట్టుకోకూడదు. చర్మ స్వభావాన్ని బట్టి వివిధ రంగులకు ఒక్కోలా స్పందించి కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే ప్రమాదముంది.
- శుభ్రంగా స్నానం చేశాక శరీరమంతా నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- కృతిమ రసాయనాలు కళ్లల్లో పడితే రెటినా దెబ్బతిని కళ్లు ఎరుపెక్కడం, మంటలు రావచ్చు.
- కళ్లలో రంగులు పడితే నలుపడం, రుద్దడం మంచిది కాదు. చల్లని నీటితో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స తర్వాత అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించాలి.
- శరీరానికి హాని కలిగించే కృత్రిమ రసాయనాల జోలికి పోకుండా, స్వచ్ఛమైన కుంకుమ, బుక్క గులాలు లాంటి రంగులతో హోలి పండుగను ఆనందంగా జరుపుకోవాలి.

ఏజెన్సీలో రంగుల కేళీ..
ఏజెన్సీలో హోలీ సందడి మొదలైంది. ముందుగా గ్రామంలోని పటేల్ ఇంట్లో ఇంటికో కుడక, రెండు చక్కెర బిల్లల హారాలు తీసుకొచ్చి సమావేశమవుతారు. అందరూ కలిసి పలు సమస్యలు, గ్రామాభివృద్ధిపై చర్చించి, వార్షిక ప్రణాళికను రూపొందించడం ఆచారం. ఈ సందర్భంగా మాతరి, మాతర పేరట రెండు వెదురు కంకలను సిద్ధం చేసి ప్రజలు తీసుకొచ్చిన చక్కెర బిల్లల హారాలు, కుడకలతో పాటు పటేల్ ఉంట్లో తయారు చేసిన గారెలు, పచ్చి ఉల్లిపాయలు, వంకాయలు, మోదుగ పూలను కర్రలకు అలంకరిస్తారు. సాయంత్రం పటేల్ ఇంటి నుంచి ఊరి పొలిమెర వరకు వాయిద్యాలతో తీసుకెళ్లి కామునిదహనం నిర్వహిస్తారు. మంటల్లో మాతరి, మాతర కంకలు పడే సమయంలో గొంగడి లేదా ఇతర వస్ర్తాలతో అలంకరించిన వస్తువులను సేకరిస్తారు. తర్వాత దీనినే నైవేద్యంగా వాడుకుంటారు. దహనం చేసిన అగ్నిగుండం చుట్టు ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. రాత్రిపూట అదే ప్రాంతంలో కబడ్డీ ఆట ఆడుతూ అక్కడే బస చేస్తారు. మరుసటి రోజున ఉదయం అన్ని ధాన్యాలను కలిపి గుడాలు తయారు చేసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గోగిపూలతో తయారు చేసిన రంగును మాతరి, మాతరిలపై చల్లిన తర్వాత ఒకరిపై ఒకరూ రంగులు చల్లుకుంటూ పండుగ వేడుకలను ఆనందోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటికి వాయిద్యాలతో నృత్యం చేస్తూ వెళ్లి కానుకలు, పండించిన నవధాన్యలు సేకరించిన అనంతరం దహనం చేసిన బూడిదను ఇంటి గడపకు రేఖలా పోస్తారు. ఇది ఆదివాసులకు శ్రీరామరక్షగా ఉంటుందని, ఎలాంటి దుష్టశక్తి గడపను దరిచేరదని వారి నమ్మకం.

68
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles