క్రీడాకారులకు సింగరేణి ప్రోత్సాహం

Wed,March 20, 2019 01:00 AM

- వేణుగోపాల్ మెమోరియల్ ట్రస్టును విజయవంతం చేయండి
- బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్
రెబ్బెన : క్రీడాకారులను ప్రోత్సహించేందుకే వేణుగోపాల్ మెమోరియల్ ట్రస్టును నిర్వహిస్తున్నామనీ, ఈ పోటీలను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి శ్రీ భీమన్న క్రీడామైదానంలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే వేణుగోపాల్ మెమోరియల్ వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ సింగరేణి నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన ట్రోఫీలను జీఎం కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బెల్లంపల్లి ఏరియాలోని మార్గన్ ఫిట్ గనిలో పనిచేసిన వేణుగోపాల్ గని ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన స్మారకార్థం ఈ పోటీలు ప్రతి సంవత్సరం ప్రత్యేక నిధులు కేటాయించి నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది వాలీబాల్, పుట్‌బాల్ పోటీలు నిర్వహించగా, ఈ సంవత్సరం వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గోలేటి శ్రీ భీమన్న క్రీడా మైదానంలో వాలీబాల్ కోర్టు ఉండగా, కబడ్డీ కోర్టు కోసం కార్పొరెట్ నుంచి మ్యాట్‌ను తీసుకవస్తామని క్రీడాకారులు కోర్టులను వినియోగించుకోవాలని కోరారు. వాలీబాల్ కోసం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబుబ్‌బాద్, మెదక్‌ల నుంచి టీమ్ వస్తాయనీ, కబడ్డీ కోసం మహాముత్తారం, గోదావరిఖని, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల జట్లు వచ్చాయనీ, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. టోర్నమెంట్‌లో మొదటి బహుమతి 20వేలు, ద్వితీయ బహుమతి 10వేల రూపాయలు, తృతీయ బహుమతి 6 వేల రూపాయలు, నాలుగో స్థానం సాధించిన వారికి 4వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని క్రీడాకారులు, అభిమానులు, కార్మికులు, కార్మిక కుటుంబాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఏ.రాజేశ్వర్, డీవైపీఎం ఎల్. రామాశాస్త్రి, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్‌వైజర్ రమేశ్, కో ఆర్డినేటర్ జీపీ చంద్రకుమార్, పీఈటీ భాస్కర్, సేవా కో ఆర్డినేటర్ కుమారస్వామి, తదితరులున్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles