డబుల్ స్పీడ్

Mon,March 18, 2019 01:58 AM

-డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో పెరిగిన వేగం
-ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న నిర్మాణాలు
-స్టీల్, సిమెంట్‌పై రాయితీ..ఇసుక ఉచిత సరఫరా
-15,963 ఇండ్ల మంజూరు..వివిధ దశల్లో పనులు
-3, 784 ఇండ్లకు టెండర్లు.. 3,320 ఇండ్ల పనులు షురూ
-626 ఇండ్ల నిర్మాణం పూర్తి.. పలు చోట్ల గృహ ప్రవేశం
-నిర్మల్ జిల్లాలో ఎల్లపల్లిలో తొలి మోడల్ కాలనీ
నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్రూం రూం ఇండ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు 15,963 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. ఏటా ఒక్కో నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున కేటాయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు 240, పట్టణ ప్రాంతాల్లో 160 చొప్పున నిర్మించేందుకు నిర్ణయించారు. వీటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాలకు రూ.5.04 లక్షలు కేటాయించగా.. పట్టణ ప్రాంతాల్లోని ఇండ్లకు రూ.5.30 లక్షల నిధులు కేటాయించారు. ఇండ్ల నిర్మాణంతో పాటు సంబంధిత కాలనీల్లో నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు అదనంగా నిధులు మంజూరు చేశారు. మౌలిక వసతుల కల్పనకు ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75వేలు మించకుండా ఉండేలా నిధులు మంజూరు చేశారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టగా జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారులతో పాటు ఇండ్లు నిర్మించే ప్రదేశాల గుర్తింపు పూర్తి కాగా ఇండ్ల నిర్మాణం వేగం పుంజుకుంది.

రెవెన్యూ శాఖతో లబ్ధిదారులు, స్థలాల ఎంపిక ప్రక్రియ చేపట్టగా నిర్మాణ బాధ్యత పంచాయతీరాజ్ శాఖకు, లేఅవుట్ ప్లానింగ్ కన్సల్టెన్సీలకు అప్పగించారు. ఒకేచోట 20-50 ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఇండ్లు నిర్మించే కాంట్రాక్టర్లకు నిర్మాణ సామగ్రి విషయంలో రాయితీ కల్పిస్తోంది. ఇసుక ప్రభుత్వ క్వారీల నుంచి సాధారణ ధరలకు ఇచ్చేలా అనుమతించింది. సిమెంట్ బస్తా రూ.230కే రాయితీపై ఇచ్చే వెసులుబాటు కల్పించింది. స్టీల్ ధరల్లో కొంత తగ్గించింది. ఒక్కో కాంట్రాక్టర్ తప్పనిసరిగా 50-100 ఇండ్లు నిర్మించేలా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలుగు జిల్లాల అధికారులు, ఎమ్మెల్యేలతో వరుస సమీక్షలు నిర్వహించి.. పనుల్లో వేగం పెంచే ప్రయత్నం చేశారు. మంత్రి అల్లోల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ కోటాలో 2వేల ఇండ్లు అదనంగా మంజూరు చేయించారు.

ఇప్పటి వరకు 15,963ఇండ్లను కేటాయించగా.. ఇందులో 3,784 ఇండ్లు టెండర్లు పిలిచారు. 3,320 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 894 ఇండ్లు ఫ్లింత్ లెవల్‌లో ఉండగా.. మరో 810ఇండ్లు బీమ్ లెవల్‌లో ఉన్నాయి. మరో 990 ఇండ్లు రూఫింగ్, వాలింగ్, ప్లాస్టరింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే 626 వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 6273 ఇండ్లు కేటాయించగా.. 1407ఇండ్లకు టెండర్లు పిలిచారు. 1407 ఇండ్లు పనులు ప్రారంభించగా.. 109 ఇండ్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ 4195ఇండ్లను కేటాయించగా.. ఇందులో 1409ఇండ్లకు టెండర్లు పిలిచారు. 757 ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. 445 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయగా.. ఇప్పటికే పలు చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేయించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1223ఇండ్లు కేటాయించగా.. ఇందులో 533ఇండ్ల టెండర్లు పూర్తయ్యాయి. 471 ఇండ్ల పనులు ప్రారంభించారు.

మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 4272 ఇండ్లను ప్రభుత్వం కేటాయించగా 435 ఇండ్లకు టెండర్లు పూర్తిచేశారు. 406 ఇండ్ల పనులు కొనసాగుతుండగా 72 ఇండ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేశారు.పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తొలి మోడల్ కాలనీ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో రూ.2.83 కోట్ల వ్యయంతో సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో 45 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ. 5.04 లక్షలు వెచ్చించగా సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కోసం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షలు వెచ్చించారు. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేశారు. 1125 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఒక్కో ఇంటికి కేటాయించగా ఇందులో 560 చదరపు అడుగుల ఇంటిని నిర్మించారు.

45మంది లబ్ధిదారులకు ఇండ్లను లాటరీ పద్ధతిన కేటాయించారు. పక్కనే మరో 24 ఇండ్ల నిర్మాణం చేపట్టగా గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 69 ఇండ్లు ఒకేచోట నిర్మించడంతో గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఈ మోడల్‌కాలనీ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రథమ కాలనీగా రూపుదిద్దుకుంది. సకల సౌకర్యాలు, హంగులతో ఇండ్ల నిర్మించడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. మిగతా చోట్ల కూడా ఇలాగే అన్ని హంగులతో ఇండ్లు సిద్ధమవుతుండగా.. త్వరలోనే లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. తాజాగా సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుండడంతో మరింత మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles