పేదలకు ఊరట

Sun,March 17, 2019 01:11 AM

-డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరం
-రూపాయి ఖర్చు లేకుండా వైద్యం
-కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తప్పిన ఇబ్బందులు
-జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు
-ఇప్పటికి 3596 సార్లు డయాలసిస్
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఒకటి. కిడ్నీలో రాళ్లు వచ్చినా, ఫెయిల్ అయినా, ఇంకేమైనా సమస్యలు వచ్చినా హైదరాబాద్, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రోజు డయాలసిస్(రక్తశుద్ధి) చేసుకోవాలంటే చాలా ఖర్చుతో పెట్టాల్సి వచ్చేది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించిన తెలంగాణ సర్కారు.. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలని సంకల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను అందబాటులోకి తీసుకొచ్చి వ్యాధిగ్రస్తుల ఆర్థికంగా భరోసా ఇచ్చింది. ఫలితంగా జిల్లాలో 1400మంది కిడ్నీ బాధితులకు ఊరట కలిగించగా, పొరుగు జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకూ మేలు చేకూర్చుతున్నది.

గతంలో సుదూర ప్రాంతాలకు..
ఆరోగ్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో సరైన సౌకర్యాలు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ దవాఖానలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పెంపుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ దవాఖానల్లోనే కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. పేద ప్రజలకు కిడ్నీ డయాలసిస్ అత్యంత ఖరీదైంది. చాలామంది పేదలు డయాలసిస్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలకు వెళ్లేవారు.

ఇటీవలే ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సకల సౌకర్యాలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుచేయడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తప్పాయి. కిడ్నీలు పని చేయని, ఫెయిలైన రోగులకు కృత్రిమంగా సేవలు అందిస్తున్నారు. గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకునే రోగులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనేవారు. స్థానికంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కావడంతో రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పరిసర ప్రాంతాల నుంచి డయాలసిస్ చేయించుకోవాలంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారు. ఇక్కడినుంచి వరంగల్ 160 కి.మీ, కరీంనగర్ 90 కి.మీ. దూరంలో ఉండేవి. ఇక హైదరాబాద్ దాదాపు 270 కి.మీ. దూరంలో ఉండడంతో వ్యాధిగ్రస్తులు అంత దూరం ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

తీరిన రోగుల కష్టాలు..
డయాలసిస్ కేంద్రం ప్రారంభం కావడంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు జనరల్ బెడ్లు, ఒక ప్రత్యేక బెడ్ కలిపి ఐదు బెడ్ల ద్వారా కిడ్నీ రోగులకు వైద్య సేవలందుతున్నాయి. ఇందులో వారానికి ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేయించుకుంటే రోగికి దాదాపు పది వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. డబ్బులు ఉన్నా లేకపోయినా తమ వారిని బతికించుకోవాలన్న ఆశతో వేలకు వేలు ఖర్చు పెట్టేవారు. జిల్లాలో సుమారు 1400మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇందులో మంచిర్యాల పట్టణంలోనే సుమారు 200మంది ఉండగా అధిక సంఖ్యలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్ ప్రాంతంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు 38మందికి 3,596 సార్లు డయాలసిస్‌కు సంబంధించిన వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ దవాఖానలోనే బ్లడ్ బ్యాంకు ఉండడం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

సురక్షిత ఫిల్టర్లు.. మంచి వైద్య సేవలు..
జిల్లాలో డయాలసిస్ రోగులకు మంచి వైద్య సేవలు అందుతున్నాయి. డయాలసిస్ రోగులు కేవలం మంచిర్యాల జిల్లా నుంచే గాక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా చికిత్స చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ మంచి వైద్య సేవలు అందుతున్నాయంటూ ఇక్కడి సేవల గురించి రోగులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ కేంద్రాల్లో ప్రజలకు సురక్షిత ఫిల్టర్లను ఉపయోగించి డయాలసిస్ చికిత్సలు అందిస్తున్నారు. డయాలసిస్ కోసం వినియోగించే ఫిల్టర్లు గతంలో మూడు నుంచి ఐదు సార్లు వరకు వినియోగించడం వల్ల వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు ఎదురయ్యేవనీ, కానీ ప్రభుత్వ దవాఖనాల్లో ఒకసారికి మాత్రమే ఫిల్టర్లు వినియోగించేలా పరికరాలను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో చాలామంది డయాలసిస్ చేసుకున్న రోగులకు ఇన్‌ఫెక్షన్లు వచ్చేవి. అయితే ఆ ఫిల్టర్లను ఒక్కసారే వాడడం వల్ల ఇన్‌ఫెక్షన్ల సమస్య తగ్గిందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలా రోగులకు ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుతున్న డయాసిస్ సేవల పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్ర భుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles