సమర్థవంతంగా పనిచేయాలి

Sun,March 17, 2019 01:09 AM

-ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు
-సమస్మాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు
-నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి
-పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై కమిషనరేట్‌లో సమీక్ష
-హాజరైన రెండు జిల్లాల అధికారులు, సిబ్బంది
-పోలీసులు, సిబ్బందికి పలు సూచనలు
జ్యోతినగర్ (పెద్దపల్లి జిల్లా) : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్‌లో సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, రామగుండం కమిషనరేట్ అంతర్ రాష్ట్ర సరిహద్దులతో కలిసి ఉన్నందున మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. సమస్మాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రీపోలింగ్‌కు తావులేకుండా ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించామనీ, అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించి, రూట్ మొబైల్స్, పోలింగ్ బూత్‌లు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ లోకేషన్లు గురించి అధికారులకు సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈమేరకు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది గ్రామ పోలీసు అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో మమేకం కావాలన్నారు.

గ్రామాల్లో, పట్టణాల్లో బెల్ట్‌షాపులపై నిఘా పెట్టాలనీ, పాత నేరస్తులను తప్పకుండా బైండోవర్ చేయాలని తెలిపారు. ప్రతి రోజు వాహనాలు తనిఖీ చేస్తు నగదు, మద్యం రవాణా, భద్రతకు విఘాతం కలిగించే వారిపై ఎన్నికల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు దిగే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ప్రధానంగా ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యతయుతంగా పని చేయాలని కోరారు. బందోబస్తుకు పారా మిలటరీ, సాయుధ దళాలు రానున్నాయనీ, ఏయే పోలింగ్ స్టేషన్ల వద్ద ఎంత భద్రత సిబ్బంది అవసరమో ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఎన్నికలకు పటిష్ట భద్రత : సత్యనారాయణ, రామగుండం సీపీ
పార్లమెంట్ ఎన్నికల కోసం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. కమిషనరేట్ పరిధిలో అన్ని బార్డర్ పోలీస్‌స్టేషన్ ఏరియాల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్‌పోస్టులు, జియో ట్యాగింగ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘాతో ప్రతి పోలింగ్ కేంద్రానికి సీసీ కెమోరాలను ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్‌ను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు ప్రశాంత, స్చేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని సీపీ చెప్పారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

సమన్వయంతో ఎన్నికలు పూర్తి చేయాలి : శ్రీ దేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్
గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ దేవసేన అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,827 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో పెద్దపల్లి జిల్లాలో 834 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ, సమస్యాత్మక, ప్రమాదకరమైన పోలింగ్ కేంద్రాలుగా విభజించి అనుగణంగా భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల డీసీపీ రక్షిత కే.మూర్తి, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, జగిత్యాల ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, కాటారం అడిషనల్ ఎస్పీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ ఎఆర్ సంజీవ్, పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ ఉన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles