పీఎం సమ్మాన్‌పై పెదవి విరుపు!

Sat,February 16, 2019 01:50 AM

- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనం అంతంతే
-అడ్డగోలు నిబంధనలతో కొర్రీలు
- అర్హులైన రైతుల ఎంపికలో అధికారుల నిమగ్నం
- జిల్లా వ్యాప్తంగా 24 వేల మందికే మేలయ్యే అవకాశం
-రైతు బంధు ద్వారా 93 వేల మందికి రూ. 25 కోట్లు అందజేత
- రాష్ట్ర సర్కారు పథకమే బాగుదంటున్న అన్నదాతలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం తరహాలోనే కేంద్ర పభుత్వం చేపడుతున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై జిల్లా రైతులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ. 8 వేలు అందిస్తున్నది. ఈ వానాకాలం నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇవ్వనున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే.. అన్ని ఎకరాలకు రైతు బంధు అమలు చేస్తుండగా, కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం మాత్రం కేవలం ఐదెకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే వర్తింపజేయనున్నది. రైతు బంధు ద్వారా జిల్లాలో 93 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుండగా, కేంద్రం అమలు చేయనున్న పథకం మూడోవంతు రైతులకు మాత్రమే అందనున్నది.

కిసాన్ సమ్మాన్ నిధికి అర్హుల ఎంపిక..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు తరహాలోనే కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం జిల్లాలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల జాబితాలను వ్యవసాయ అధికారులు గుర్తిస్తున్నారు. క్లస్టర్లు, గ్రామాల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు అర్హులైన రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు మాత్రమే కేంద్ర పథకానికి అర్హులుగా గుర్తించాలని నిబంధన ఉండడతో అధికారులు ఆ దిశగా అర్హులను గుర్తిస్తున్నారు. మండలాల వారీగా సిద్ధం చేసిన జాబితాలను వ్యవసాయ సహాయ సంచాలకులు, ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారులు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి తుది నివేదిక పంపనున్నారు. రైతుల గుర్తింపుకోసం మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు. రైతు బంధు పథకం నుంచి ఆర్థిక సాయం పొందుతున్న రైతుల్లో.. కనీసం మూడో వంతు రైతులకు కూడా కేంద్ర పథకం వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చాలా మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిబంధనలు లేకుండా రైతుబంధు..
కిసాన్ సమ్మాన్ నిధికి అనేక నిబంధనలు..
తెలంగాణ సర్కారు రైతు బంధు పథకంలో ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేస్తున్నది. ఒక గుంట భూమి ఉన్న వారికి సైతం పథకాన్ని వర్తింపజేస్తున్నది. గుంటకు రూ. 100 చొప్పున ఎకరానికి రూ. 4 వేలు అందించింది. రెండు విడతల్లో ఎకరానికి రూ. 8 వేలు రైతులకు అందించింది. వచ్చే వానాకాలం నుంచి ఎకరానికి రూ. 10 వేలు అందించనుంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సమ్మాన్ నిధి పథకం అమలుకు నిబంధనలు విధించింది. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. అవి కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. మరోవైపు గతేడాది ఆదాయపు పన్ను కట్టిన వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. వృత్తి నిపుణులైన వారికి, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్డెట్ అకౌంట్స్, ఆర్కిటెక్ట్స్, సొంత ప్రాక్టిస్ కలిగినవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, అనుబంధ కార్యాలయాల్లోని ఉద్యోగులు, స్థానిక సంస్థల, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారికి కిసాన్ సమ్మాన్ పథకం వర్తించదు. రాజ్యాంగ పరమైన పదవులు ఉన్నవారికి కూడా వర్తించదు.
జిల్లాలో మూడో వంతు రైతులకే వర్తింపు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం జిల్లాలో మూడో వంతు రైతులకు మాత్రమే వర్తించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం జిల్లా వ్యాప్తంగా 93 వేల మందికి వర్తిస్తుండగా, సుమారు రూ. 25 కోట్లు అందిస్తున్నారు. ఇదే తరహాల్లో కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం జిల్లాలో 24 వేల మందికి మాత్రమే వర్తింపజేసే అవకాశం ఉంది. ఇది కూడా ఎకరానికి రూ. 2 వేల చొప్పున మూడు విడుతలో రూ. 6 వేలు అందించనున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles