పరిషత్‌పోరుకు సన్నాహాలు..!

Wed,February 13, 2019 12:30 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగా, జిల్లా పరిషత్ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. దీంతో ప్రతి మూడు నెలలకు ఓ సారి జరిగే సమావేశానికి దూరభారంతో సభ్యులు, అధికారులు పూర్తి స్థా యిలో హాజరు కావడం లేదు. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్పీని కూడా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జడ్పీ ఉండగా.. కొత్తగా మూడు జిల్లాలు మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొత్తగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఉన్న జడ్పీ సిబ్బందిని అన్ని జిల్లాల జడ్పీ కార్యాలయాలకు సర్దుబాటు చేసి.. కార్యాలయాల నిర్వహణ, కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఉమ్మడి జిల్లా విశాలంగా ఉండడంతో.. సభ్యులు ఎక్కువగా ఉండడం, జిల్లాల వారీగా అన్ని శాఖల అధికారులు రావడంతో .. సమావేశాలు రోజంతా, ఒక్కోసారి రెండు రోజులు నిర్వహించాల్సి వచ్చేది. ఇకపై జిల్లాకో జడ్పీ ఏర్పాటుతో విస్తీర్ణం, సభ్యులు, అధికారులు తక్కువగా ఉండనున్నారు. దీంతో అన్ని శాఖలపై సమగ్ర చర్చకు అవకాశం లభించడంతో పాటు ఒకే రోజు పూర్తి చేసే వీలుంటుంది. ప్రతి జడ్పీలో 15-20మంది లోపే సభ్యులు ఉండనున్నారు. జడ్పీ విభజనకు సంబంధించిన ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే పూర్తి చేసే అవకాశాలున్నాయి.

2014లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండగా.. మొత్తం 52మండలాలు ఉండేవి. వీటన్నంటికి కలిపి ఒకే జడ్పీ ఉం డగా.. 52మంది జడ్పీటీసీలు, ఇద్దరు కో-అప్షన్, మొత్తం 54మంది సభ్యులు జడ్పీలో ఉండేవారు. 2014 ఏప్రిల్ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. జూన్‌లో ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించారు. 2014, జూలై 5న జడ్పీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జూలై వరకు పాలక వర్గాల గడువు ఉన్నప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువు ప్రకారం 2019, ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 2016అక్టోబర్ 11న పూర్వ ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా పునర్విభజన చేశారు. గతంలో 52మండలాలు ఉండగా.. కొత్తగా 18మండలాలు ఏర్పాటు చేయటంతో వీటి సంఖ్య 70కి చేరింది. ఆదిలాబాద్‌లో నాలుగు, నిర్మల్‌లో 6, మంచిర్యాలలో 4, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 3మండలాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో 19 మండలాలు, ఆదిలాబాద్‌లో 18, మంచిర్యాలలో 18, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15 మండలాలున్నాయి. మొత్తం నాలుగు అర్భన్ మండలాలు, 66గ్రామీణ మండలాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో రెండు, నిర్మల్, ఆదిలాబాద్‌లో ఒక్కో అర్బన్ మండలాలున్నాయి. నిర్మల్ జిల్లాలో 18గ్రామీణ మండలాలు, ఆదిలాబాద్‌లో 17, మంచిర్యాలలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15చొప్పున ఉన్నాయి. జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటు చేసినందున.. ఆ ప్రకారంగా మండల పరిషత్‌ల సంఖ్య కూడా పెరుగనుంది.

నాలుగు జిల్లాల్లో 18 కొత్త మండలాలు ఏర్పాటు చేయగా.. ఇందులో 14గ్రామీణ మండలాలున్నాయి. ఈ మండలాలను ఇంకా పంచాయతీరాజ్ మండలాలుగా గుర్తించలేదు. కొత్త మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు లేవు. పాత మండలాల్లోనే మండల పరిషత్ కార్యాలయాలు ఉండగా.. కొత్తగా మండల పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసి ఎంపీడీవోల నియామకం చేయాల్సి ఉంది. కొత్త మండలాల ప్రకారం మండల పరిషత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో 634ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. మండలానికి ఒకరు చొప్పున 52మంది కోఅప్షన్ సభ్యులు ఉండేవారు. పంచాయతీల్లో మాదిరిగానే రిజర్వేషన్లు అయిదేళ్లకు బదులుగా.. ఇకపై పదేళ్లు అమలు చేయనున్నారు. అంటే ప్రస్తుతం నిర్ధారించే రిజర్వేషన్లు రెండు విడతలు అంటే.. 2029వరకు వర్తిసాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల రహితంగా నిర్వహించగా.. పరిషత్ ఎన్నికలను మాత్రం పార్టీ గుర్తులపై నిర్వహించనున్నారు. దీంతో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడే అవకాశాలున్నాయి. జడ్పీ విభజనతో పాటు కొత్త మండలాలకు మండల పరిషత్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే.. ఈ ప్రక్రియ చేపడుతామన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles