పాములవాడకు తారురోడ్డు

Tue,January 22, 2019 01:14 AM

-తీరిన ఏళ్లనాటి రహదారి కష్టాలు
-సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
సిర్పూర్(యు): ఏళ్లనాటి పాములవాడ గ్రామ రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామానికి రోడ్డు సరిగా లేకపోవడంతో అత్యవసర సమయాల్లోనూ ఎడ్లబండ్లపై వెళ్లాల్సిన బాధలు తప్పాయి. ఈ గ్రామస్తుల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రాళ్లురప్పలు, గతుకులతో నిండిన రహదారిని స్థానంలో తారురోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. 15 రోజుల క్రితం తారురోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడికి వెళ్లాలన్నా ఎడ్లబండే దిక్కు..
మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని పాములవాడకు 60ఏళ్లుగా సరైన రోడ్డు లేదు. ప్రతీ పనికి గ్రామస్తులు మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. సరైన రోడ్డు లేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండేది. అత్యవసర సమయాల్లో అవస్థలు పడాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్నా ఎడ్లబండ్లలో వెళ్లాల్సిన దుస్థితి. మండలంలోని చిల్లాటిగూడ, ఖాతిగూడ, కొడ్డిగూడ, తుమ్రిగూడ గ్రామాల ప్రజలు కూడా ఇదే దారి నుంచి వెళ్లే వారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలు కాలినడకనే రాకపోకలు నిర్వహిస్తూ కాలం వెల్లదీశారు. వర్షాకాలం వచ్చిందంటే కొన్ని చోట్ల రాళ్లు, మరికొన్ని చోట్ల బురదమయమై నడవడానికి అవస్థలు పడేవారు. దీంతో రోగులను ఎడ్లబండ్లపై దవాఖానలకు తరలించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం గ్రామం వరకు తారురోడ్డు వేయడంతో ఆటోలు వస్తున్నాయి. ఎప్పుడూ రాని వాహనాలు గ్రామానికి వస్తుండడంతో గ్రామస్తులు ఇన్నాళ్ల పడిన రహదారి కష్టాలు మరిచిపోతున్నారు.

సంతోషంగా ఉంది
పాములవాడకు రోడ్డు నిర్మించడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు మా గ్రామానికి వెళ్లాలంటే బురదరోడ్డే ఉండేది. బండ్లు కూడా నడవకపోతే కాలినడకన వెళ్లేవాళ్లం. నా చిన్నప్పటి నుంచి ఈ సమస్య చూస్తనే ఉన్న. ఇన్నేండ్ల కష్టానికి తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపింది.
-శేక్ ఖలీల్
దూరభారం తగ్గింది
మాది బాండేయేర్ గ్రా మం. మా గ్రామానికి పాములవాడ నుంచి వెళ్లాలె. కానీ.. పాములవాడకు రోడ్డు లేక మహగాం, నేట్నూర్ నుంచి తిరిగి వెళ్లేటోళ్లం. ఇప్పుడు పాములవాడ రోడ్డు కావడంతో మాకు దూరం తగ్గింది. దూరం తగ్గడంతో రవాణా చార్జీలు కూడా తగ్గినయ్.
-కుంర భీంరావ్
రోడ్డు నిర్మాణంతో అభివృద్ధి
పాములవాడను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశాం. చాలా ఏండ్లుగా ఈ గ్రామానికి కనీసం రోడ్డు లేక అభివృద్ధి జరుగలేదు. ఇప్పుడు రోడ్డు నిర్మించాం. త్వరలో ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్ ఎన్నుకుంటారు. మా గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది.
-తొడసం ధర్మరావ్ టీఆర్ నాయకుడు

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles