తొలి ఫైట్ నేడే

Mon,January 21, 2019 12:21 AM

- మొదటి విడత పంచాయతీ ఎన్నికలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సోమవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని 113 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఇందులో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 95 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, 294 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 992 వార్డులకుగాను 335 వార్డులు ఏకగ్రీవం కాగా, 23 వార్డులకు నామినేషన్లు రాలేదు. దీంతో 634 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తంగా 1401 మంది అభ్యర్థులు వార్డు స్థానాలకు పోటీపడుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 1,10,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల విధుల్లో 2,529 మంది సిబ్బంది
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడంతో పాటు అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 2,529 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది. పోలింగ్ బాక్సులు 992, ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

మొదటి విడతలో 1,10,493 మంది ఓటర్లు..
జిల్లాలోని ఆరు మండలాల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,10,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. సిర్పూర్-టి మండలంలో 18,858 మంది ఓటర్లు, కౌటాల మండలంలో 23,160 మంది, చింతలమానెపల్లిలో 20,059, బెజ్జూర్‌లో 18,773 మంది, పెంచికల్‌పేట్‌లో 10,719 మంది, దహెగాం మండలంలో 18,924 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఓటర్ల సౌకర్యం కోసం టెంట్లు, తాగునీటి వసతి కల్పించారు.

ఎన్నికలకు పోలీసు బందోబస్తు
175 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 119 మంది ఏఎస్‌ఐలు, 250 మంది కానిస్టేబుళ్లు, 150 మంది హోమ్‌గార్డులు, 200 మంది ఆపరేషన్ డ్యూటీ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles