కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం..


Fri,November 16, 2018 12:06 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను అమ్ముకొని స్థానికులకు కాకుండా ప్యారాషూట్ నాయకుడికి కేటాయించి మోసం చేసిందనీ, అందుకే చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తీరుతామని ఆ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రేగళ్ల విజయానంద్ స్పష్టంచేశారు. ఈమేరకు చెన్నూర్‌లోని జైహింద్ ఆఫీసర్స్ క్లబ్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులు, తమ అనుచరులతో గురువారం సమావేశమై మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయానంద్‌తో పాటు మాజీ ఎంపీపీ రేగళ్ల మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు చెన్న నారాయణ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కమ్మల బాపు, చెన్న శ్రీనివాస్, బజ్జూరి శ్రీనివాస్, నీలం వెంకటేశ్వర్, సుంకరి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్, రాసమల్ల అంకులు, చెన్న ప్రకాశ్, తోట లింగయ్య, తడకల రాజన్న, తోట కమలాకర్‌రావు, వేల్పు బాపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషిచేశామని చెప్పారు. తన భార్య రేగళ్ల విజేతకు టికెట్ ఇస్తామని పార్టీ అధిష్ఠానంతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే నాలుగు నెలల క్రితం పార్టీలో చేరిన స్థానికేతరుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి తీరుతామని వారు చెప్పారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేసేందుకు నియమించిన కమిటీల్లో తాను ఒక సభ్యుడునన్నారు. సమావేశంలో దాదాపు 400మంది అనుచరులు పాల్గొన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...