కాంగ్రెస్‌లో కుమ్ములాట..!

Fri,November 9, 2018 11:52 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు, గొడవలు, ఆందోళనలు కొత్త విషయమేం కాకపోయినా.. తాజాగా టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు.. తాజాగా టికెట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పని చేయమని, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహాకూటమి పొత్తు ల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించగా.. మిగతా 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల పార్టీలోకి చేరిన రాథోడ్ రమేశ్‌కు ఖానాపూర్ టికెట్ ఖరారైందనే ప్రచారంతో గతంలో పోటీ చేసి ఓడిపోయిన హరినాయక్ వర్గం ఆందోళనకు దిగింది. ఆయనతో పాటు 100 మంది వర్గీయులు హైదరాబాద్‌లో గాంధీభవన్ ముందు ఆమరణ దీక్ష చేపట్టారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వమని చెప్పిన పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. రాథోడ్ రమేశ్‌కు ఎలా ఇస్తారంటూ హరినాయక్ వర్గం గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టింది.

కూటమితో కుమ్ములాట.. రేవంత్ వర్గానికి షాక్
మహాకూటమి పొత్తుల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని సీపీఐకి ఇవ్వడం పట్ల.. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిలుముల శంకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం కాకుండా మంచిర్యాల నియోజకవర్గం సీపీఐకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన తన వర్గీయులతో సమావేశమై.. సీపీఐకి ఇస్తే ఓటమి ఖాయమని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని ప్రతిపాదించారు. సీపీఐకి కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇస్తే.. టీజేఎస్ నుంచి ఆశించిన తు డుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ స్వతం త్ర అభ్యర్థిగా బరిలో దిగాలని యోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గానికి టికెట్ల కేటాయింపులో గట్టి షాక్ తగిలింది. రేవంత్‌రెడ్డి వర్గీయులుగా ఉన్న సోయం బాపురావు, బోడ జనార్ధన్‌కు గడ్డు పరిస్థితులే ఉన్నాయి. రేవంత్‌రెడ్డి వర్గంలోని వారిలో బోథ్‌లో సోయం బాపురావుకు టికెట్ వస్తుందనే చర్చ ఉండగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అనిల్ జాదవ్, ఆయన వర్గీయులు ఆందోళనకు దిగుతున్నారు. ఆయనకు డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మద్దతు ఉండటంతో.. అనిల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సోయంకు టికెట్ వస్తే.. అనిల్ వర్గం సహకరించే పరిస్థితి లేదు. చెన్నూర్‌లో రేవంత్‌రెడ్డి వర్గీయుడిగా ఉన్న మాజీమంత్రి బోడ జనార్ధన్‌కు మొండిచేయి చూపుతున్నారు. వెంకటేశ్ నేతకు ఇస్తారనే చర్చ ఉండగా.. జనార్దన్ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జనార్ధన్ కార్యకర్తలతో ఇప్పటికే స్పష్టం చేశారు.

స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి..!
ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాతకు టికెట్ వస్తోందనే ప్రచారం ఉండగా, మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, గతంలో పోటీ చేసి ఓడిన భార్గవ్ దేశ్‌పాండే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఆర్‌ఆర్, భార్గవ్‌లో ఎవరికి వచ్చినా.. గండ్రత్ సుజాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచార రథం కూడా సిద్ధం చేసుకున్నారు. ఎవరికి వారు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం అరవింద్‌రెడ్డి మధ్య మొదటి నుంచి వర్గపోరు నడుస్తోంది. ఎవరికి వారు టికెట్ వస్తుందని.. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్టు కోసం ఢిల్లీ స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్ రాకున్నా.. మరొకరు రెబల్ బరిలో దిగనున్నారు. లేదంటే బీజేపీకి వెళ్తారనే ప్రచారం ఉంది. మరోవైపు బెల్లంపల్లి కాకుండా మంచిర్యాల సీపీఐకి కేటాయిస్తారేమోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముధోల్‌లో పవార్ రామారావు పటేల్‌కు టికెట్ వస్తుందనే చర్చ ఉండగా.. నారాయణరావు పటేల్ తనకే వస్తుందని పేర్కొంటున్నారు. ఇక్కడ ఒకరికి వస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేదు. సిర్పూర్(టి)లో పాల్వాయి హరీశ్‌రావు, రావి శ్రీనివాస్ మధ్య పోటీ ఉండగా.. ఒకరికి టికెట్ వస్తే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles