అది ఆంధ్రా కూటమి

Mon,October 15, 2018 01:07 AM

-మహాకూటమికి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్టే..
-పరాయి పాలనతో మళ్లీ బానిస బతుకులు ఖాయం
-ప్రజలారా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి..
-దొంగల కూటమి నాయకులను చిత్తుగా ఓడించండి
-తెలంగాణకు చంద్రశేఖరరావే శ్రీరామ రక్ష
-ఆయన పాలనలోనే బంగారు తెలంగాణ
-టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం
-రెబ్బెన మండలం నంబాల, వంకులంలో ప్రచారం
రెబ్బెన/ కాగజ్‌నగర్ టౌన్:కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమి పేరిట జట్టు కడుతున్నాయి. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తుకు సిద్ధమవుతున్నాయి. చంద్రశేఖర్‌రావును ఓడించడానికి మహాకూటమి శక్తి సరిపోదు. ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు బద్ధశత్రువులుగా ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉండేవి. దొంగల కూటమికి చంద్రబాబు ధన సాయం చేస్తుంటే.. తెలంగాణ వ్యతిరేకులు జనసాయం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే మాటలు విని జనం నవ్వుతున్నారు. ఆ మోసకారి పొత్తును ప్రజల ఆదరాభిమానాలు కలిగిన కేసీఆర్ చిత్తు చేయడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సమితికి జనం శ్రీరామ రక్షగా ఉన్నారు. అని ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రెబ్బెన మండలం నంబాల, వంకులం గ్రామాల్లో పర్యటించగా, కాగజ్‌నగర్ పట్టణంలో సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి ప్రచారం చేశారు. పలుచోట్ల మహిళలు బతుకమ్మ, మంగళహారతులు, కోలాటాల మధ్య స్వాగతం పలికారు.

అది ఆంధ్రా కూటమి అనీ, మహాకూటమికి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్టేనని ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం రెబ్బెన మండలం వంకులం, నంబాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలకు మద్దతు ఇస్తే పరాయి పాలనతో మళ్లీ బానిస బతుకులు ఖాయమనీ, తెలంగాణ అభివృద్ధి అరవై ఏండ్లు వెనక్కి వెళ్లినట్టేననీ, ఈ విషయాన్ని గమనించాలని ప్రజలకు సూచించారు. ఓట్ల కోసం వస్తే వారిని తరిమికొట్టాలన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అనీ, ఆయన పాలనలోనే బంగారు తెలంగాణ సాధ్యమని పేర్కొన్నారు. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని తైబానగర్ కాలనీ 9వ వార్డులో సిర్పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, మున్సిపల్ అధ్యక్షురాలు సీపీ విద్యావతి, పార్టీ కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సండ్రొని పల్లి, శంకర్‌పల్లి, చిర్రకుంట, మామిడిగట్టు గ్రామాల్లో చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు పూజలు చేశారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్ ఆవరణలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంచిర్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు వివేక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జన్నారం మండలంలోని ఇందన్‌పెల్లి, చింతగూడ, తపాలపూర్ గ్రామాల్లో ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేకానాయక్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles