ఫిబ్రవరిలో పేపర్ ఉత్పత్తి ప్రారంభం

Fri,October 12, 2018 11:39 PM

కాగజ్‌నగర్‌టౌన్ : సిర్పూర్ పేపర్ మిల్లులో వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో ఉత్పత్తి ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని జేకే మిల్లు డైరెక్టర్ కుమారస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని మిల్లు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా మిల్లు షట్‌డౌన్ పేరిట మూతపడి ఉందనీ, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కృషి, ఎన్‌సీఎల్‌టీ తీర్పుతో జేకే యాజమాన్యం మిల్లును స్వాధీనం చేసుకుందన్నారు. ఉత్పత్తి ప్రారంభించేందుకు 550 మంది అనుభవజ్ఞులైన వారితో పనులు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. మిల్లులో మొత్తం 8 పేపర్ మిషన్లు ఉండగా, వాటిలో 7,8 మిషన్లతో పాటు సీఎల్‌ఓ-2 విభాగంలో మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1,2,4,5 మిషన్ల పనులు విడతల వారీగా చేస్తున్నామనీ, 7,8 మిషన్లలో ఉత్పత్తిని ప్రారంభించి, ఆ తర్వాత 3,6 మిషన్లతో పాటు పల్ప్‌మిల్ విభాగంలో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మిల్లులో గతంలో కంటే ఎక్కువ ఉత్పత్తే లక్ష్యంగా అధునాతన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

పర్మినెంట్, స్టాఫ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులను దశల వారీగా పనుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన డిపార్టుమెంట్లకు గతంలో పనిచేసి అనుభవం ఉన్న వారిని కొంత మందిని తీసుకుని పనులు చేయిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మిల్లులో పనిచేస్తున్న కార్మికులందరికీ మెడికల్, స్కిల్ టెస్టులు చేయడం జరుగుతుందనీ, అందులో భాగంగానే కార్మికులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రకటన జారీ చేయడం జరిగిందన్నారు. విధుల్లో తీసుకునే విషయంలో కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ, ప్రతి ఒక్కరికీ మిల్లులో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. 2014 వరకు మిల్లులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికుల వివరాలు సేకరించి, డబ్బులు అందజేసేందుకు కృషిచేస్తామన్నారు. విరమణ పొందిన కార్మికులు ప్రస్తుతం ఉన్న మిల్లు క్వార్టర్లను ఖాళీచేసి, వారికి రావల్సిన డబ్బులను పొందాలని సూచించారు. లేకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్ణయించన ధర మేరకు అద్దె వసూలు చేస్తామన్నారు. అనుమతి లేకుండా క్వార్టర్లలో ఉన్న వారికి కూడా అద్దె వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్, 2019 జనవరిలోగా పనులు పూర్తిచేసి ట్రయల్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మిల్లులో పూర్తిగా ప్లాస్లిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందన్నారు. యూనిట్ హెడ్ మయాంక్ జిందాల్, వైస్ ప్రెసిడెంట్ కమర్షియల్ కమల్ లకోటియా, జీఎం హెచ్‌ఆర్ విద్యాసాగర్, జీఎం టెన్నికల్ గురునాథ్‌రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ రమేశ్‌రావు పాల్గొన్నారు.

163
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles