ఘనంగా పొలాల పండుగ


Sun,September 9, 2018 01:48 AM

సిర్పూర్(టి) : పొలాల అమావాస్యను శనివారం మండలంలో రైతులు, ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని దుబ్బగూడ, షేక్‌అహ్మద్‌గూడ, గోవింద్‌పూర్, అంబేద్కర్‌నగర్, జ్యోతినగర్, గంగాయిగూడ, పాతట్లగూడ, శివపూర్ కాలనీలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఉండి నైవేద్యాలు సమర్పించారు. రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకరించిన ఎడ్లతో కాలనీల్లో ఊరేగించి స్థానిక హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
కౌటాల : పొలాల పండుగను మండలంలో ఘనంగా జరుపుకొన్నారు. వ్యవసాయానికి అన్ని విధాలా సహకరించే ప శువులను ఈ రోజు పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పశువులను శుభ్రంగా కడిగి, వాటిని రంగులు, పూల మాలలతో అందంగా అంలకరించారు. పిండి వంటలు చేసి వాటికి తినిపించి, మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఎడ్లతో సమీపంలోని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
చింతలమానేపల్లి : మండల వ్యాప్తంగా శనివారం పొలాల అమావాస్య సంబురాలు అంబరాన్నంటాయి. రైతులు బసవన్నలను ప్రత్యేకంగా ముస్తాబు చేసి వాటిని కాలనీల గుండా ర్యాలీగా బయల్దేరి హనుమాన్, పోచమ్మ ఆలయాల వద్ద తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవన్నలకు నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది పాటు పాడిపంటలు సమృద్ధిగా పండి పిల్లాపాపలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం బసవన్నలను ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు.
బెజ్జూర్ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో పొలాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి రంగులతో అలంకరించారు. పత్రి ఆకుల దండలు తయారు చేసి ఎద్దులకు కట్టారు. తోరణాలను ఇంటి గుమ్మాలకు కట్టారు. నైవేద్యం వండి ఆలయాలకు ఎద్దులతో సహా వెళ్లి ఎద్దులను ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎద్దులను ఇంటికి తీసుకొచ్చి నైవేద్యం తినిపించారు.
పెంచికల్‌పేట్ : మండల కేంద్రంతో పాటు ఎల్కపల్లి, చేడ్వా యి, బొంబాయిగూడ, ఎల్లూర్, కొండపల్లి, డోర్‌పల్లి, మురళిగూడ, కమ్మర్‌గాం, పోతెపల్లి, అగర్‌గూడ, దరొగపల్లి, తదితర గ్రామాల్లో శనివారం పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకొన్నారు. ఎద్దులను శుభ్రం చేసి, పూజించి నూతన వస్ర్తాలను ధరించి ఆలయాల చుట్టూ ఊరేగింపు చేశారు. పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.
దహెగాం : మండలంలో పొలాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంతం పొలాల అమావాస్య వేడుకల సందర్భంగా ఇండ్లను శుభ్రం చేసుకొని స్నానాలు ఆచరించి పిండి వంటలను తయారు చేసుకొన్నారు. ఎడ్లను శుభ్రంగా కడిగి ప్రత్యేకంగా అలంకరించారు. పోచమ్మ ఆలయం వద్ద ఎడ్లను పూజించారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...