ఐరిష్‌తో రేషన్..!

Thu,September 6, 2018 11:57 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : రేషన్ సరుకుల పంపిణీలో ఇప్పటికే ఈ-పాస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల శాఖ మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇకపై ఐరిష్ (కనుపాప) విధానంలో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం వేలిముద్రల ద్వారా సరుకులను పంపిణీ చేస్తుండగా త్వరలో ఐరిష్ విధానం అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకుల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఐరిష్ విధానం ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో మిగతా జిల్లాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నవంబర్ నుంచి జిల్లాలో అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ -పాస్ మిషన్లతో పాటు ఐరిష్ కాప్చర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఐరిష్ విధానంతో చర్మవ్యాధులు, చేతి గీతలు అరిగిన వారికి ఇబ్బందులు తొలగనున్నాయి.

దశల వారీగా సంస్కరణలు
రేషన్ పంపిణీ వ్యవస్థలో దశల వారీగా సంస్కరణలు కొనసాగుతున్నాయి. తొలుత రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానించి బోగస్ కార్డులను ఏరివేశారు. తర్వాత ఈ-పాస్ మిషన్లను అందుబాటుకి తీసుకొచ్చి వేలిముద్రల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. దీంతో సరుకులు పక్కదారి పట్టడం చాలా వరకు తగ్గిపోయింది. నెలకు సగటున 30 శాతం వరకు సరుకులు మిగులుతున్నాయి.

జిల్లాలో 275 రేషన్ షాపులు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 275 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. 1,23,556 ఆహార భద్రత కార్డులు, 12,094 అంతోద్యయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. మొత్తం 1,35,650 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ఒక్కో లబ్ధిదారుకు నెలకు ఆరుకిలోల చొప్పున 16,87,694 క్వింటాళ్ల బియ్యం, 2,231 వేల లీటర్ల కిరోసిన్ ప్రతినెలా సరఫరా చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణదారుల క్లోజింగ్ బ్యాలెన్స్‌ను అతి తక్కువగా చూపి బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారు. ప్రస్తుతం ఈ - పాస్ విధానం రావడంతో క్లోజింగ్ బ్యాలెన్స్‌ను ఎంత ఉంటే అంత చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ- పాస్‌లోనూ పక్కదారి
ఈ-పాస్ విధానంలోనూ బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఐరిష్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు, చేతులు లేని వారు, వేలి ముద్రలు పడని వారికి ఈ విధానంతో ఇబ్బందులు తొలగనున్నాయి. తొలుత రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక శిక్షణ
ఐరిష్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపి ణీ చేసేందుకు డీలర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో నవంబర్ నెలలో ఐరిష్ విధానం అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ యోచిస్తోంది. గతంలో బయోమెట్రిక్ విధానంలో పంపిణీచేసినట్లుగానే డీలర్లకు శిక్షణ ఇచ్చి సరుకులు లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

119
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles