ముందస్తు పంచాయతీ!


Sun,January 21, 2018 02:38 AM

-పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి
-మేలోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
-ఉమ్మడి జిల్లాలో కొత్తగా 224 గ్రామ పంచాయతీలు
-ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
-అనుబంధ గ్రామాలనూ చేర్చే యోచన
నిర్మల్ ప్రధాన ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సర్పంచ్ గిరికోసం నాయకుల ఉత్సాహంత్వరలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అప్పుడే పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 224 గ్రామ పంచాయతీల కోసం ప్రతిపాదనలు పంపగా, మరికొన్ని అనుబంధ గ్రామాలనూ ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకా శముండగా, సర్పంచ్ గిరికోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది.

పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో 2013 జూలైలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు గడువు ఉంది. 2013లో ఎన్నికలు జరిగినప్పుడు ఉమ్మడి జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు, 8832వార్డులు, 8832 పోలింగ్ కేంద్రా లు ఉన్నాయి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించారు. తొలి విడతలో భాగం గా జూలై 23, 2013న ఆసిఫాబాద్, ఉట్నూర్ రెవెన్యూ డివిజన్లలో నిర్వహించారు. 17మండలాల్లోని 252 గ్రామ పంచాయతీలు, 2618 వార్డులకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో జూలై 27, 2013న ఆదిలాబా ద్, మంచిర్యాల రెవెన్యూ డివిజన్లలో 22 మండలాల్లో 374 గ్రామ పంచాయతీలు, 3730 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో జూలై 31, 2013న నిర్మల్ డివిజన్‌లోని 13మండలాలు, 240గ్రామ పంచాయతీలు, 2384వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.

రాజకీయ సందడి..

గతంలో వచ్చిన ఆదేశాల మేరకు బ్యాలెట్ బాక్సులను ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టగా, ఇప్పటి నుంచి గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తారనే ప్రచారంతో పల్లెల్లో తాజాగా గ్రామ పంచాయితీ జోరుగా రాజుకుంటోంది. వచ్చే జూలై నాటికి పాలక వర్గాలకు గడువు ముగుస్తుండగా, ఆ లోపే ఎన్నికలు నిర్వహించి కొత్త వారికి శిక్షణ ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉంది. దీంతో అటు అధికార యంత్రాంగంతో పాటు.. ఇటు రా జకీయ నాయకులు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టా రు. జిల్లాల విభజన నేపథ్యంలో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలనే కొనసాగించాలా.. ఏమైనా మార్పులు చేర్పు లు చేయాలా.. అనే అంశంతో పాటు ఆయా జిల్లాలు, పంచాయతీలు, వాటి పరిధిలో కావాల్సిన పోలింగ్ బూతులపై సమాచారం తెప్పిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడగా.. అన్ని మండలాలు, గ్రామాలు ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే ఉన్నా యి. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో పోలింగ్ బూ తుల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఉన్నా యో.. లేవో పరిశీలన చేపడుతున్నారు.

కొత్తగా 224 జీపీలు..

జిల్లాల విభజన జరిగిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 243, నిర్మల్ జిల్లాలో 240, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 173, మంచిర్యాల జిల్లాలో 210 చొప్పున పంచాయతీలున్నాయి. ఆయా పంచాయతీలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ బూతులు, సౌకర్యాలు, మార్పులు చేర్పుల లాంటి అంశాలు అధికారులు పరిశీలిస్తున్నారు. 500జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. పూర్వ జిల్లా లో ఇప్పటికే 224కొత్త పంచాయతీల జాబితా సర్కారు కు చేరింది. వీటితో పాటు మరికొన్ని తండాలు, గ్రామాలను పంచాయతీలుగా మార్చాలని కోరుతూ.. తాజాగా వినతులు, ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటిని జిల్లా పం చాయతీ అధికారులు స్వీకరించి.. సర్కారుకు పంపేందు కు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో కొత్త పంచాయ తీల ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానున్నది. ఒకవైపు కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు సర్కారు పంపుతూనే.. మరోవైపు ఎప్పు డు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 243 గ్రామ పంచాయతీలుండగా, 507 రెవెన్యూ గ్రామాలున్నాయి. 114 తండాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, కొత్తగా మరికొన్ని పంచాయతీల ప్రతిపాదనలు ఉన్నాయి. 1072 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 240గ్రామ పంచాయతీలు, 2384 వార్డులున్నాయి. రెవెన్యూ గ్రామాలు 428 ఉన్నాయి. 52 తండా లు, గూడెంలు కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. 820బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 173గ్రామ పంచాయతీలు ఉండ గా, 438రెవెన్యూ గ్రామాలున్నాయి. 407 అనుబంధ గ్రామాలు, 300లకుపైగా చిన్న గ్రామాలున్నాయి. కొత్త గా 57 గ్రామ పంచాయతీలు ఏర్పడే అవకాశముంది. 1788పోలింగ్ బూతులు, 337బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో 210గ్రామ పంచాయతీలుండగా, 384రెవెన్యూ గ్రామాలున్నాయి. కొత్తగా 14 తండాలు, గూడెంలు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. అనుబంధ గ్రామాలకు సంబంధించి 5 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

అనుబంధ గ్రామాలనూ..

ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3-15వరకు గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గిరిజన తండాలు 5-10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో గ్రామ పంచాయతీలో పనులుంటే.. ఒక రోజంతా సమయం వృథా అవుతోంది. వివిధ రకాల పనులకోసం గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లడం కష్టంగా ఉండటంతో.. తాజాగా ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తుండటంతో గిరిజనులకు ఉపయోగకరంగా మారనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరగా.. ఇటీవల మరికొన్ని తండాలు, గ్రామాలను చేర్చారు. కొత్తగా మరికొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత పంచాయతీలో జనాభా, పంచాయతీ నుంచి దూరం, వార్షిక రాబడి వంటి వివరాలతో నివేదికలు పంపారు. తండాల జనాభా 500, అంతకు మించి ఉండాల్సి ఉంటుంది. మూడు కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు దృష్టి పెట్టారు. ఒకే తండాలో 500జనాభా లేకుంటే.. వివిధ తండాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. పాత వాటితో పాటు కొత్తగా ఆవిర్భవించే గ్రామ పంచాయతీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రకటనతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...