ప్రాణం తీసిన వేగం

Fri,January 19, 2018 12:49 AM

-తిర్యాణి మండలం వీరన్నఘాట్ వద్ద కూలీల ట్రాక్టర్ బోల్తా
-ఒకరి మృతి, 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-కరీంనగర్‌కు క్షతగాత్రుల తరలింపు
-బాధితులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శ
-గుండాలలో విషాదఛాయలు
-ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి ఈటల ఆరా
తిర్యాణి/ గూడెం దండేపల్లి: అతివేగం, అజాగ్రత్త ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ తిర్యాణి మండలం గుండాల వీరన్న ఘాట్ వద్ద బోల్తాపడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పది మంది దాకా గాయపడడం విషాదం నింపింది. క్షతగాత్రులను పోలీసులు లక్షెట్టిపేట, కరీంనగర్ దవాఖానలకు తరలించగా, వీరిలో ఒక గర్భిణి పరిస్థితి విషమించి కడుపులోనే బిడ్డ చనిపోయింది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీయగా, కరీంనగర్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

తిర్యాణి మండలంలోని గుండాల వీరన్నఘాట్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందడం విషాదాన్ని నింపిం ది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు పొలంలో వరినాట్లు వేసేందుకు కూలీల కోసం గుండాల చేరుకున్న ట్రాక్టర్, 15 మందితో తిరుగు పయనమైంది. గుండాలకు సమీపంలోని వీరన్నఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కోట్నాక దేవ్‌బా యి(40) అక్కడికక్కడే మృతిచెందగా మరో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తాండూర్ సీఐ పురుషోత్తం, తిర్యాణి, దండెపల్లి ఎస్‌ఐలు శ్రీనివాస్, తోట సంజీవ్ ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను 108 ద్వారా ఆరుగురిని లక్షెట్టిపేటకు, తొమ్మిది మందిని కరీంనగర్ దవాఖానకు తరలించారు. మృతురాలి భర్త కోట్నాక జలపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నామని తిర్యాణి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదానికి అతివేగం, అజాగ్రత్తే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాద స్థలా న్ని మంచిర్యాల జేసీ సురేందర్‌రావు పరిశీలించారు.

ఘటనపై సీఎం ఆరా
కరీంనగర్ హెల్త్ : గుండాల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీసినట్లు సమాచారం. కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వారు కరీంనగర్ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమను ఫోన్‌లో ఆదేశించారు. ఆ జిల్లాలోని కోనరావుపేట మండలంలో పర్యటనలో ఉన్న ఆమె హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. గాయపడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్న ఆ మె క్షతగాత్రులకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందనీ, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. క్షతగాత్రులను చూసి చలించిన జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడి, వైద్యులను అప్రమత్తం చేసి 9 మంది ని అంబులెన్సుల్లో దగ్గరుండి తరలించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలనీ, ఆరోగ్యశ్రీ వర్తించని వా రికి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని తెలిపా రు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లీలావతి, పూలబా యి, లక్ష్మీబాయి,పార్వతి, భారతీబాయి, కమలాబా యి, ప్రేమలత, వెన్నెల, జయబాయి చికిత్స పొందుతున్నారు. వీరిని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కోనరావుపేట జడ్పీటీసీ పల్లెం అన్నపూర్ణ, తిర్యాణి జడ్పీటీసీ కమల, జక్కుల నాగరాజు, మోతె గంగారెడ్డి పరామర్శించారు. మ్యాక్స్ క్యూర్ సిబ్బంది కిరణ్, కరుణాకర్ దగ్గరుండి వైద్య సేవలందించారు.

క్షతగాత్రుల్లో ఐదు నెలల గర్భిణి
- అమ్మ కడుపులోనే శిశువు మృతి
చెందినట్లు వైద్యుల నిర్ధారణ
ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఐదు నెలల గర్భిణి లీలావతి ఉండగా, గర్భస్థశిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లీలావతి పరిస్థితి కూడా విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆమె పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

గాయపడ్డ వారిని ఆదుకుంటాం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కరీంనగర్‌లోని మ్యాక్స్ క్యూర్ దవాఖానకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితుల పరిస్థితిని చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. ఈ సందర్భంగా క్షతగాత్రుల కుటుంబసభ్యులతో మాట్లాడుతూ వారు త్వ రగా కోలుకుంటారనీ, ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి, బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles