ప్రాజెక్టు పనుల్లో జాప్యం వద్దు


Thu,January 12, 2017 02:10 AM

-వచ్చే జూన్‌నాటికి కుమ్రం భీం కింద సాగునీరందించాలి
-అవసరమైతే భూసేకరణకు 2013 చట్టం అమలు చేయాలి
-పురోగతిపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలి
-అధికారులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశం
-మంత్రి అల్లోల, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో సుడిగాలి పర్యటన
-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-హైమన్‌డార్ఫ్ వర్ధంతికి హాజరు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ప్రాజెక్ట్ కాలువల పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దనీ, వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందించాలని అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలో బుధవారం సుడిగాలి పర్యటన చేసిన ఆయన, ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాల కలెక్టర్లతో కలిసి ప్రాజెక్టు వద్ద సమీక్షించారు. కాలువల నిర్మాణం వేగవంతం చేయాలనీ, అవసరమైతే భూసేకరణకు 2013చట్టాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ చంపాలాల్‌కు సూచించారు. అనంతరం వాంకిడి, జైనూర్, ఆసిఫాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మార్లవాయిలో హైమాన్ డార్ఫ్ వర్ధంతికి హాజరై, గిరిజనుల సంక్షేమం కోసం ఆ దంపతులు చేసిన కృషిని కొనియాడారు.

కుమ్రం భీం ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం చేయవద్దని అధికారులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతుకుముందు మొదట వాంకిడిలో ఏర్పాటు చేసిన దాల్‌మిల్‌ను ప్రారంభించిన ఆయన, ఆనంతరం కుమ్రం భీం ప్రాజెక్ట్ వరకు రూ.4 కోట్ల 23 లక్షలతో వేయనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువల పనులను వేగవంతం చేయాలనీ, అవసరమైతే భూసేకరణ చట్టం 2013ని వినియోగించుకోవాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలను పరిష్కరించేందుకు పూర్తిస్థాయి సిబ్బందితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల కు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడమ కాలువ పనులను వచ్చే జూన్‌నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

60 కిలోమీటర్ల కాలువకు సంబంధించిన 45 కిలోమీటర్ల ప్రధాన కాలువ పూర్తయిందనీ, మిగితా భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. 258 డిస్ట్రిబ్యూటరీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొంత మంది గిరిజనేతరులు సాగులో ఉన్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం పంటలు సాగులో ఉన్నాయని దీంతో భూసేకరణలో జాప్యం జరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించినప్పటికీభూములను ఇచ్చేందుకు ముందుకురావడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు నిధులున్నప్పటికీ కుమ్రం భీం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చేజూన్ నాటికి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీటిని అందించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రాజెక్టు పురోగతిపై ప్రతి సోమవారం ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ చంపాలాల్‌ను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబందించి కాంగ్రెస్ పారీ నాయకులు కోర్టుకెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టుకు ఇటీవలే రాష్ట్ర సర్కారు రూ. 5 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం జైనూర్ మండలంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావ్ రూ. 2 కోట్ల 35 లక్షలతో నిర్మించిన గోదాంలను ప్రారంభించారు. రాగాపూర్ చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ. 2 కోట్ల 36 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్లవాయిలో నిర్వహించిన హైమన్‌డార్ఫ్ 30 వ వర్థంతి సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఇంజినీరింగ్ అధికారులు భగవంత్‌రావు, విష్ణు ప్రసాద్, ఎంపీపీ, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డార్ఫ్ దంపతుల కృషి వల్లే గిరిజన చట్టాలు


హైమన్‌డార్ఫ్ దంపతుల కృషి వల్లే ప్రస్తుతం గిరిజన చట్టాలు అమలవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మూడు జిల్లాల కలెక్టర్లతో కలిసి నివాళులర్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతక ముందు మండల కేంద్రంలో గిడ్డంగుల భవనాన్ని ప్రారంభించి, మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మార్లవాయి, సిర్పుర్(యు) మండలం రాఘపూర్ శివారులోనున్న చెరువుపై మినీ ట్యాంక్‌బాండ్‌కు భూమిపూజ చేశారు.

హైమన్‌డార్ఫ్‌తో కలిసి గిరిజన విద్యాభివృద్ధికి కృషిచేసిన కనక హన్ను మాస్టర్ విగ్రహాన్ని మార్లవాయి గ్రామంలో అవిష్కరించారు. హైమన్‌డార్ఫ్ దంపతులకు నివాళులర్పించారు. వారు నివసించిన గుడిసెను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్దప్రకాశ్, చంపాలాల్, ఆర్వీ కర్ణన్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెల్లప్ప, ఐటీడీఎ ఏపీవో నాగోరావ్, ఎంపీడీవో దత్తారాం, జైనూర్, సిర్పుర్(యు) ఎమ్మార్వోలు శంకర్‌గౌడ్, ఇమ్రాన్‌ఖాన్, లక్కెరావ్, ఎంపీపీ విమల, జడ్పీటీసీ అస్రఖానం, సుబుర్‌ఖాన్, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇంతియాజ్‌లాలా, అర్జున్, భీంరావ్, నకన వెంకటేష్, కనక అంబాజీ తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS