సన్నరకానికి ససేమిరా..!


Mon,January 9, 2017 11:01 PM

-కొనేందుకు ముందుకు రాని మిల్లర్లు
-ఎక్కడికక్కడ పేరుకుపోతున్న నిల్వలు
-ఒకవేళ కొన్నా సవాలక్ష కొర్రీలు
-ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1800
-దక్కుతున్నది రూ.1600లోపే!
-నిండా మునుగుతున్న రైతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :దహెగాంకు చెందిన ఈ రైతు పేరు చమకరి గంగన్న. తనకున్న భూమిలో సన్నరకం వరి సాగు చేసిండు. 27 క్వింటాళ్ల వడ్లను అమ్మకానికి తెస్తే మిల్లర్లు సవాలక్ష కొర్రీలతో ఇబ్బంది పెడుతన్రు. మద్దతు ధర రూ.1800కు ససేమిరా అంటున్నరు. నాలుగైదు రోజుల్లో పైసలు కావాలంటే క్వింటాల్‌కు రూ. 1300, అదే ఉగాదికైతే రూ. 1600 ఇస్తామంటున్నరు. దీంతో ఏం చేయాలో తెలియని గంగన్న తండ్లాడుతున్నడు. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నరు. యాసంగి పెట్టుబడుల కోసం తప్పనిసరి విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా, సుమారు 75 వేల టన్నులు దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఐకేపీ, సహకార సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సన్నరకానికి రూ. 1800, దొడ్డు రకానికి రూ. 1510 మద్దతు ధర ప్రకటించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో రైతన్నలు ఆశపడగా, మిల్లర్లు నీళ్లు చల్లారు. దళారులు, వ్యాపారుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, రైతుల నుంచి తీసుకునేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.

సోమవారం ఆసిఫాబాద్ మండలం మోతుగూడ వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం తీసుకునేందుకు కాగజ్‌నగర్‌కు చెందిన మిల్లరు నిరాకరించారు. తప్పలు, తరికలు ఎక్కువగా ఉన్నాయంటూ కొనలేదు. అదే ఓ దళారీ తీసుకొచ్చిన ధాన్యాన్ని మాత్రం అసలు పరీక్షించకుండానే రూ. 1800కు కొనుగోలు చేశారని ఐకేపీ సిబ్బంది తెలిపారు.

మిల్లర్ల మాయాజాలం..


మిల్లర్ల మాయాజాలంతో రైతన్నలు కుదేలవుతున్నారు. దళారులు, వ్యాపారుల వద్ద వరి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్న మిల్లర్లు, నేరుగా రైతులనుంచి కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ధాన్యం నిల్వలు కల్లాలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. ఒకవేళ గత్యంతరం లేక దళారులకు సన్నరకం ధాన్యం అమ్మితే క్వింటాలుకు రూ. 1500 కూడా ఇవ్వడం లేదు. అడిగేవారెవరూ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నలను నిలువు దోపిడీ చేస్తున్నారు.

వాయిదాలతో అమ్మితే రూ. 1300లే..


మిల్లర్లు, దళారులు కల్లాలోనే బేరసారాలాడుతూ ధరలు నిర్ణయిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో డబ్బులు కావాలంటే సన్నరకానికి క్వింటాలుకు రూ. 1300 ఇస్తామనీ, ఒక వేళ ఉగాదికి కావాలంటే రూ. 1600 చెల్లిస్తామంటూ మభ్యపెడుతున్నారు. దళారుల వద్ద ఎలాంటి ఆంక్షలు లేకుండానే ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, రైతుల విషయానికి వచ్చేసరికి ధరలను తగ్గించడం, ఆంక్షలు విధించడం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదాతలు ధాన్యం విక్రయిస్తూ నష్టపోతున్నారు.


వ్యాపారుల వద్ద మిల్లర్లు కొంటున్నారు..


- సోనబోయిన మొండయ్య రైతు దహెగాం
మేము దాన్యం నేరుగా మిల్లర్ల వద్దకు తీసుకువెళ్తే కొనటం లేదు. దళారులు తెచ్చిన వరిని వెంటనే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరని వ్యాపారులకు చెల్లిస్తున్న మిల్లర్లు మాకు మాత్రం చెల్లించటం లేదు. వ్యాపారులు మాదగ్గర సన్న వడ్లు క్వింటాలుకు 14 వందలకంటే ఎక్కువగా ధర ఇవ్వటం లేదు. ఇదికూడా వారం రోజుల వాయిదాతో కొంటున్నారు.

దాన్యాన్ని తీసుకోవటంలేదు...


- బి. రమేష్ ( కొనుగోలు కేంద్రంలో బుక్‌కీపర్ )
మేము ఇందిర క్రాంతి పథం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రంలో రైతుల వద్దనుంచి వడ్లు కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లోని ఓ మిల్లు తీసుకువెళ్తే కొనటం లేదు. తేమ శాతం కూడా 7 మాత్రమే ఉంది. పూర్తినాణ్యమైన వడ్లను తీసుకవెళ్లిన కూడా తప్పలు, తరికలు ఉన్నాయని వడ్లను తీసుకోలేదు.

రైతులకు నష్టం జరుగుతుంది


- రాధ, ఇందిర క్రాంతిపథం సీసీ
వరి అమ్మకాల్లో రైతులు నష్టపోతున్నారు. దళారులు తీసుకువెళ్లే వడ్లను మాముందే నేరుగా కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. మేము రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లను తీసుకునేందుకు అనేక ఆంక్షలు పెడుతున్నారు. మా కేంద్రాలకు వచ్చిన దాన్యం అలాగే ఇంక అలాగే ఉంది. సన్నరకం వడ్లకు 1500 రూపాయల ధరకూడా మిల్లర్లు చెల్లించేందుకు ముందుకు రావటం లేదు. మేము రైతుల వద్దనుంచి దాన్యాన్ని కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నతాధికారులు చొరువచూపి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

20 వేల నష్టం వచ్చింది...


- భీమన్న రైతు రెబ్బెన
నేను మూడెకరాలు కౌలు తీసుకొని సన్న వడ్లు సాగుచేశాను. 75 వేల రూపాయలు ఖర్చుచేశాను. 55 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1800 రూపాయలకు ఎవరు కొనలేదు. దీంతో మిల్లర్‌కు 1450 రూపాయలతో అమ్మేశాను. దీంతో 20 వేల రూపాయల నష్టం వచ్చింది.

ఎవరు కొనటం లేదు...


- బోయినె శంకరమ్మ మహిళ రైతు
30 వేల రూపాయలు ఖర్చుచేసి 2 ఎకరాల్లో వరిసాగుచేశాను. 45 బస్తాలు దిగుబడి వచ్చింది. సన్నవడ్లకు ప్రభుత్వం 1800 రూపాయల ధర ప్రకటిస్తే వ్యాపారులు, మిల్లర్లు 1500 రూపాయల రేటు ఇస్తామన్నారు. దీంతో నేను వడ్లను అమ్మలేదు. ఇప్పుడేమో 1400 రూపాయల దర ఇస్తామంటున్నారు. నేను ఇంతవరకు వడ్లను అమ్మలేదు. మద్దతు ధరకు కొనేందుకు ఎవరు ముందుకు రావటం లేదు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS