ఆశ్రమంలో అర్ధాకలి!


Mon,January 9, 2017 10:59 PM

-సరుకులు సరఫరా చేయని కాంట్రాక్టర్లు
-దూరభారం, కొండపై ఉందనే సాకుతో తప్పించుకుంటున్న వైనం
-అమలుకాని మెనూ.. అందని పౌష్ఠికాహారం
-ప్రతి రోజూ ఉదయం కిచిడీనే దిక్కు
-సాయంత్రం స్నాక్స్ కరువే
-అలమటిస్తున్న విద్యార్థులు
-పట్టించుకోని ఉన్నతాధికారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది తిర్యాణి మండలం మంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పరిస్థితి. సర్కారు సరిపడా నిధులు.. సరుకులు అందిస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పిల్లలంతా అర్ధాకలితో అలమటించాల్సి వస్తున్నది. దూరభారం సాకుతో సరుకులు సరఫరా చేయకపోవడంతో పౌష్ఠికాహారం వారికి అందని ద్రాక్షే అవుతున్నది. అరకొర అన్నం, సాంబారుతో నిత్యం అలమటిస్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

జిల్లా కేంద్రానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలోని మంగి ఆశ్రమ పాఠశాలలో (ఐటీడీఏ గిరిజన సంక్షేమ) మూడు నుంచి పదో తరగతి వరకు ఉండగా, 130 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అందించే పౌష్ఠికాహారంతో పాటు వివిధ సరుకులను కాంట్రాక్టర్లు సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. దూరభారం పేరిట సరుకులు సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ దుస్థితి నెలకొంది. మంగి ఆశ్రమ పాఠశాలకు సరఫరా అయ్యే సరుకులను రోంపెల్లి ఆశ్రమ పాఠశాలలో దింపేసి చేతులు దులుపుకుంటున్నారు.

రోంపెల్లి ఆశ్రమ పాఠశాల నుంచి మంగి ఆశ్రమ పాఠశాలకు సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు సరిగా లేకపోవడం, గుట్ట ప్రాంతం కావడంతో సదరు కాంట్రాక్టర్లు సరుకులను సరఫరా చేయకుండా తప్పించుకుంటన్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా సరఫరా చేసే సరుకులు తప్పా.. పాలు, గుడ్లు, అరటి పండ్లు, పల్లిపట్టీలు, ఉల్లిగడ్డలలాంటివేవీ అందడం లేదు. ఇవేగాక గత మూడు నెలలుగా కాస్మోటిక్స్ కూడా ఇవ్వడం లేదు.

అమలుకాని మోనూ..


మంగి ఆశ్రమ పాఠశాలలో సక్రమంగా మెనూ అమలు కావడం లేదు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ప్రతి రోజు రూ. 24, రూ. 28 దాకా ఖర్చుచేస్తోంది. అయితే సరుకులు సరఫరా కాకపోవడంతో మెనూ పాటించడం లేదు. ప్రతి రోజూ ఉదయం వివిధ రకాల అల్పాహారం ఇవ్వాల్సి ఉండగా, ప్రతి రోజూ కిచిడీతోనే వెళ్లదీస్తున్నారు.

11 గంటలకు పాలు ఇవ్వాల్సి ఉన్నా, అలాంటి దాఖలాలు లేవు. మధ్యాహ్నం భోజనంలో గడ్డుతోపాటు, కూరగాయల కూర, సాంబార్ , పప్పు తప్పనిసరిగా పెట్టాలి. కానీ ఇక్కడ పప్పు పెడితే, కూరగాయలు పెట్టడం లేదు. ఇక మధ్యాహ్న భోజనంలో సాంబారుతోనే నెట్టుకొస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ రూపంలో పల్లిపట్టి, ఉడుక బెట్టిన బొబ్బెర్లు, పండ్లు ఇవ్వాలి. ఇది అమలు కావడం లేదు. సాయంత్రం భోజనంలో పప్పు సాంబార్ పెట్టాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేరు.

కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం..


తిర్యాణి మండలం మంగి ఆశ్రమ పాఠశాలకు సరుకులు సరఫరా చేయకుండా సదరు కాంట్రాక్టర్లు నిత్యం రవాణా చార్జీలను వెనకేసుకుంటున్నారు. సరైన రోడ్డ సౌకర్యమే కాదు, కనీసం సెల్ నెట్‌వర్క్ కూడా లేని ఈ ఆశ్రమ పాఠశాలకు సరుకులను సరఫరా చేయకున్నా అడిగే వారెవరూ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు, వార్డెన్, హెచ్‌ఎంలు సైతం వంతులవారీగా విధులకు డుమ్మాలు కొడుతున్నట్లు తెలుస్తున్నది. కనీసం నెలకోసారైనా ఉన్నతాధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS