ప్రభుత్వ పాఠశాలలే పది కేంద్రాలు

Thu,December 12, 2019 12:58 AM

-46 జోన్లు, 89 కేంద్రాలు, 17,827మంది విద్యార్థులు
-తిమ్మారావుపేటలో కేంద్రానికి అనుమతి, జీళ్లచెరువులో తొలగింపు..?
-ఒకటి రెండు సెంటర్ల మార్పునకు కసరత్తు
-ఉత్తర్వులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్న అధికారులు

ఖమ్మం ఎడ్యుకేషన్‌,డిసెంబర్‌11: ప్రభుత్వ పాఠశాలలు సకల సదుపాయాలతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగులు, ప్రణాళికలు విజయవంతంగా అమలవుతున్నాయి. విద్యలో ప్రధాన భాగం పరీక్షల నిర్వాహణది. సమైక్య పాలనలో ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగే పది పరీక్ష కేంద్రాల్లో అత్యధిక శాతం విద్యార్థులు నేలమీద కూర్చోని పరీక్షలు రాసే వారు. కనీస సౌకర్యాలు లేక కేంద్రాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ అవస్థల మధ్య పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వీటన్నింటిని అధిగమిస్తూ రాష్ట్రంలో పాఠశాలల్లో బల్లలు, మంచినీటి సౌకర్యం, గదులు పూర్తి స్థాయిలో రూ.కోట్లు కేటాయించి పాఠశాలలను ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. పటిష్టంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం పది పరీక్షల కేంద్రాలను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తూ సెంటర్లను నిర్షయించడం తుది దశకు చేరుకున్నారు.

83 ప్రభుత్వ, ఆరు ఎయిడెడ్‌...
2020 మార్చిలో జరగనున్న పది పరీక్షల కేంద్రాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జీఓ నెంబర్‌ 151/బీ-2 ద్వారా ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుని కేంద్రాలను నియమించాలి, కేంద్రాల ఎంపికకు పరిశీలించాల్సిన ప్రాధాన్యాలను స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించాలని స్పష్టం చేసింది. విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని, జంబ్లింగ్‌ పద్దతిలోనే కేంద్రాలను ఎంపిక చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. పరీక్షలు జరిగే సమయంలో, నిర్వాహణలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఆస్కారం ఏర్పడనుందనే అభిప్రాయంగా కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. విద్యాశాఖాధికారులు తీసుకునే నిర్ణయాల ద్వారా జరిగే స్వల్ప మార్పులు మినహా దాదాపు కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తియినట్లే. రెగ్యూలర్‌ విద్యార్థుల కోసం 89 కేంద్రాలను ఎంపిక చేయగా వీటిలో 83 ప్రభుత్వ, ఆరు ఎయిడెడ్‌ పాఠశాలలను ఎంపిక చేశారు.

46 జోన్లుగా విభజన...
జిల్లాలో పది పరీక్షలకు హజరయ్యే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులను జంబ్లింగ్‌ విధానంలో కేంద్రాలుగా కేటాయించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 474 పాఠశాలలను 46 జోన్లుగా విభజించారు. ఉదాహారణకు సత్తుపల్లి మండలంలోని 27 స్కూల్స్‌ను ఒక సమూహాంగా ఎంపిక చేసి ఆయా విద్యాసంస్ధల్లో చదువుతున్న విద్యార్థులకు ఐదు జోన్లుగా కేటాయించనున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు పది కేంద్రాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేయడంతో అధికారులు గత సంవత్సరం మౌలిక సదుపాయాలు ఉండి కేటాయించని సెంటర్లను ఈ దఫా పది పరీక్షలకు కేంద్రాలుగా కేటాయిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఏ, బీ, సీ కేంద్రాలుగా విభజించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న స్కూల్స్‌ను ‘ఏ’ సెంటర్లుగా గుర్తిస్తారు. పోలీస్‌ స్టేషన్‌కు ‘8’ కిలోమీటర్ల పరిధిలో ఉండే పరీక్ష కేంద్రాలను ‘బీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు. పోలీస్‌ స్టేషన్‌కు ‘8’ కిలోమీటర్ల కంటే దూరంగా ఉండే కేంద్రాలను ‘సీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు. 2020 మార్చిలో జరిగే పరీక్షలకు ఏ సెంటర్లు-58, బీ సెంటర్లు-12, సీ సెంటర్లు-19గా అధికారులు గుర్తించారు.

స్వల్ప మార్పులు ఉండే అవకాశం...
ఉన్నాతాధికారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ఈ దఫా నూతనంగా తిమ్మారావుపేటలో పరీక్ష కేంద్రం కేటాయించేందుకు అనుమతులు వచ్చాయి. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రం కేటాయిసున్నారు. కూసుమంచిలోని జీళ్లచెర్వులో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కారణాల రీత్యా సెంటర్‌ను తొలగించేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. రూరల్‌ మండలంలోని కారుణ్య పాఠశాల కేంద్రాన్ని రూరల్‌ కేజీబీవీకి మార్చే ఆలోచనను పరీక్షల విభాగం అధికారులు పరీశీలిస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఎంపిక చేసిన దాని ప్రకారం 24 కేంద్రాలు ఉండగా మరో సెంటర్‌ పెరిగే అవకాశం ఉంది. పెనుబల్లిలో సైతం ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి దృష్ట్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవి మినహా దాదాపుగా పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లే. గత సంవత్సరం 19వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఈ విద్యాసంవత్సరం రెగ్యూలర్‌లో 17,840 మంది హజరవుతుండగా, స్లమెంటరీలో మరో వెయ్యి మందికిపైగా రాసే అవకాశాలున్నాయి. అపరాద రుసుంతో ఇంకా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండటంతో విద్యార్థుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు.

230
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles