మయూరిసెంటర్ : నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నవజాత (ఆడశిశువు) శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు చనిపోయిందని కుటుంబీకులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఇల్లందు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన బానోత్ సేలా అనే గర్భిణిని ఈ నెల 3వ తేదీ రాత్రి ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా పరిషత్ సెంటర్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సాధారణ కాన్పు ద్వారా శిశువుకు జన్మనిచ్చింంది. కాన్పుకు ముందు కూడా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారని, సాధారణ కాన్పు అనంతరం శిశువు బాగానే ఉందని చెప్పారని బాధితులు పేర్కొన్నారు. కాన్పు సమయంలో వ్యవధి ఎక్కువ కావడం, శిశువు ప్రేగును మెడకు వేసుకుని జన్మించడంతో శ్వాసకోశ ఇబ్బంది ఉండడంతో మరో చిన్నపిల్లల ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స కోసం వెళ్లాలని సూచించారని వారు తెలిపారు. అక్కడికి వెళ్లగానే అక్కడి వైద్యులు శిశువును పరీక్షించి శిశువు అంతకు ముందే మృతి చెందిందని తెలిపారని చెప్పారు. శిశువు తండ్రి శివప్రసాద్ కొత్తగూడెం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించారు.