ఎంత చదివితే అంత జ్ఞానం..

Sun,November 17, 2019 12:28 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్16: పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలతో పాటు ప్రపంచ, దేశ చరిత్ర, సాహిత, రాజ్యాంగం, నాయకుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదివి ప్రపంచ జ్ఞానాన్ని సముపార్జించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ పాఠ్యాంశాలతో పాటు నెలకు కనీసం ఒక పుస్తకాన్ని తప్పనిసరిగా చదవం ద్వారా విజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని సూచించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రతో పాటు మనదేశ రాజ్యాంగం, చరిత్ర, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పఠనం చేయడం ద్వారా భవిశ్యత్తులో హాజరయ్యే పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు, కస్తూర్భా గాంధీ విద్యాలయాలలో 40 వేల పుస్తకాలను అందించడం జరిగిందని, దీనిలో భాగంగా మహిళా జూనియర్ కళాశాలకు ఈ రోజు రెండు వందల పుస్తకాలను అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆయన పుస్తకాలు అందించి ప్రశంసించారు.

చదివింది మరోమారు నివృత్తి చేసుకోవాలి : మేయర్ పాపాలాల్
విద్యార్థులు తమకు ఉపయోగపడే విజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు పుస్తక పఠనం తప్పని సరి చేసుకోవాలని ఖమ్మం నగర మేయర్ డాక్టర్ గుగులోతు పాపాలాల్ సూచించారు. అధ్యాపకుల బోధనపై పాఠ్యాంశాల విజ్ఞానం ఆధారపడి ఉంటుందన్నారు. చదివిన దానిని మరోమారు నివృత్తి చేసుకోవడం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరయ్యే విధంగా పాఠశాల, కళాశాల గ్రంథాలయాల్లో పుస్తకాల ఏర్పాటుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ కృష్ణసత్య ప్రసాద్‌రాయ్, పద్మావతి, కార్పొరేటర్ బాలగంగాధర్‌తిలక్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి చంద్రమోహన్, డాక్టర్ సీతారామ్, విజయలక్ష్మి, ఆనందచారీ, కళాశాల అద్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles