ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి

Sun,November 17, 2019 12:28 AM

మయూరి సెంటర్, నవంబర్ 16: ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఆరోగ్య ఖమ్మంగా తీర్చిదిద్దుకునేందుకు అన్ని వ్యాధులను గుర్తించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాలను సేకరించే పనిలో తమ శాఖ నిమగ్నమై పనులు వేగవంతం చేస్తుందని, అందులో భాగంగానే హెచ్‌ఐవీ పరీక్షల నిర్వహణకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ కళావతిబాయి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా 15 రోజులకు ముందుగానే రద్దీ ప్రాంతాలైన బస్టాండ్, రైల్వేస్టేషన్, హమాలీ కూలీల అడ్డాలు, ఆటోస్టాండ్, డిగ్రీ కళాశాలల ప్రాంతాలు, స్లమ్ ప్రదేశాల వద్ద మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు హెచ్‌ఐవీ రక్త పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ వైద్యపరీక్షలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారిని ప్రభుత్వ వైద్యశాలలో గల ఐసీటీసీ కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్, చికిత్సలను అందించి ప్రభుత్వం ద్వారా వారికి హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు చెందిన పింఛన్ సౌకర్యాన్ని అందించనున్నట్లు ఆమె తెలిపారు.

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రధాన సంచాలకుల ఆదేశాలతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించడం జరుగుతుందని, 4000ల మందికి రక్త పరీక్షలు ఈ 15 రోజుల్లో నిర్వహించాల్సిన లక్ష్యం తమ ముందుందన్నారు. ఇందులో చైల్డ్‌ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్, టార్గెటెడ్ ఇంటర్ వెన్షన్ ఎన్‌జీవోలు, లైన్‌డిపార్ట్ మెంట్ సిబ్బంది, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, పర్యవేక్షుకులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్ల సహకారంతో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో 16,188 మంది హెచ్‌ఐవీ పాజీటీవ్ కేసులు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గల ఏఆర్‌టీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకున్నారని, వారిలో ప్రతి నెల క్రమం తప్పకుండా 5,609 మంది మందులు వాడుతున్నారని, ఇందులో 2944 మంది ఏఆర్‌టీ ఆసరా పింఛన్ పొందుతున్నారన్నారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 53 హెచ్‌ఐవీ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయని, జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు సుమారు 1,978 మంది ఉన్నారని, ఇందులో మహిళలు 1,432 మంది ఉండగా స్వలింగ సంపర్గులు 546 మంది ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.

వీరికి ఆరోగ్యసేవలు అందించేందుకు జాగృతి అనే స్వచ్చంద సంస్థ జిల్లాలో పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాడానికి కృషి చేస్తుందని, అదే విధంగా జనవాణి అనే సంస్థ ద్వారా హెచ్‌ఐవీ అనేది ఎయిడ్స్ వ్యాధిని కల్గించే క్రిమి అని, ఈ క్రిమి మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు వెంటనే బయట పడవని తెలిపారు. నెమ్మదిగా రోగనిరోధక శక్తిని తగ్గించి శక్తి నశించిపోయినప్పుడు మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడతాయని, ఈ వ్యాధి నిర్మూళన పట్ల అవగహన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులకు వాడిన సూదులు, సిరంజీలు, లేజర్లు, బ్లేడ్లు ఇతరులకు ఉపయోగించడం వల్ల, హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల రక్తాన్ని పరీక్షించకుండా ఇతరులకు రక్త మార్పిడి చేయడం వల్ల, హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులతో లైంగిక సంబంధాలుంటే హెచ్‌ఐవీ సోకిన తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని తెలిపారు. ఐసీటీసీ పరీక్షా కేంద్రాల ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రి, సత్తుపల్లి, మధిర ప్రభుత్వాసుపత్రులలో పరీక్షా కేంద్రాలున్నాయని, పీపీటీసీటీ కేంద్రాలలో గర్భిణి స్త్రీలకు సలహాలు, సూచనలు, హెచ్‌ఐవీ పరీక్షలుంటాయన్నారు. సురక్ష క్లినిక్, ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు ఆ వ్యాధిని నిర్మూళించేందుకు ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ సంసిద్దంగా ఉందని, ఈ వైద్య పరీక్షలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ ఎయిడ్స్, లెబ్రసీ అధికారి డాక్టర్ ప్రవీణా, తదితరులు పాల్గొన్నారు.

280
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles