రక్తదాతల సేవలు ప్రశంసనీయం..

Fri,November 8, 2019 11:28 PM

-భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్
భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్8: భద్రాచలం ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యూనిట్ అధికారులు, సిబ్బంది స్వచ్చందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి, తోటి వారికి ప్రాణదానం చేయడం ప్రశంసనీయమని, అదేవిధంగా రక్తదానం శిబిరం విజయవంతంగా నిర్వహించినందుకు భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ సంబంధిత యూనిట్ అధికారులు, సిబ్బందిని కొనియాడారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పీవో గౌతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐటీడీఏ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం కలిసి సుమారు 89మంది రక్తదాతల నుంచి రక్తం సేకరించామన్నారు. ఐటీడీఏలో పనిచేసే యూనిట్ అధికారులు రక్తదానం చేయాలని ముందుకొచ్చిన వారిని అభినందించారు. ప్రపంచంలో జీవించే ప్రతీ మనిషికి రక్తం అనేది చాలా ముఖ్యమని, శరీరంలో అణువణువునా రక్తం ప్రసరించినప్పుడే మనిషి జీవిస్తాడన్నారు. రక్తం ఇవ్వడానికి వచ్చిన వివిధశాఖల అధికారులు, సిబ్బంది, ఎంఎల్‌టీ విద్యార్థులతో పీవో మాట్లాడారు.

తలసేమియా రోగులకు రక్తం అవసరమవుతుందని, ప్రస్తుతం రెడ్ క్రాస్ సొసైటీ, ఏరియా ఆసుపత్రిలలో రక్తనిల్వలు ఉన్న చోట మనలాంటి వారి రక్తం ఇస్తే రక్తం అవసరం ఉన్న వారికి అత్యవసర సమయంలో రక్తం సహాయం చేసిన వారమవుతామని పీవో వివరించారు. అనంతరం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అరుణ చైతన్య మాట్లాడుతూ.. ఏరియా ఆసుపత్రికి ఎక్కువశాతం మారుమూల గిరిజన గ్రామాల నుంచి నిరుపేదలైన గిరిజనులు రక్తకణాలు తక్కువ, హిమోగ్లోబిన్ సమపాల్లో లేకుండా వస్తారని తెలిపారు. అటువంటి వారికి మీలాంటి వారు ఇచ్చిన రక్తం సమయానుకూలంగా అందించి వారికి పునర్జన్మను కల్పించడానికి సహాయ పడినవారవుతామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ నాగోరావు, ఏవో భీమ్, ఏడీఎం అండ్ హెచ్‌వో శ్రీనిఆసులు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్, డీడీ జహీరుద్దీన్, జీసీసీ మేనేజర్ కుంజా వాణి, సురేందర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ చంద్రశేఖర్, అణిత, శ్రీదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంఎల్‌టీ విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles