-రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా అందుకున్న ఏసీపీ
ఖమ్మం క్రైం, నవంబర్ 8: ఖమ్మం టౌన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఘంటా వెంకట్రావు శుక్రవారం రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ చేతుల మీదుగా మూడు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ చేతుల మీదుగా నగదు రివార్డు అందుకున్నారు. గత ఏడాదిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నిర్వహించిన జాతీయస్థాయి పోలీస్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరుపున పాల్గొని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
జాతీయస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించే పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సహాకాల్లో భాగంగా నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వీవీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందుకున్న ఏసీపీ ఘంటా వెంకట్రావును ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఇంజరాపు పూజలు అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను సాధించి జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు సాధించాలని సూచించారు.