ఇసుకాసురులపై ఉక్కుపాదం

Fri,November 8, 2019 01:20 AM

బూర్గంపహాడ్: ఇసుకను కబళించి, అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకాసురులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఐదుగురు అక్రమార్కులపై గురువారం కేసు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. బూర్గంపహాడ్ ఎస్‌ఐ బొమ్మెర బాలకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ బాలకృష్ణ, తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ అక్రమంగా ఇసుక లోడ్‌తో ఉన్న టిప్పర్, జేసీబీని స్వాధీనపర్చుకుని స్టేషన్‌కు తరలించారు. ఇసుక రవాణాకు పాల్పడిన ఇదే గ్రామానికి చెందిన మూల ఆదిరెడ్డి, మూల కృష్ణకాంత్‌రెడ్డి, పాల్వంచకు చెందిన తటుకుల నాగేష్, మర్రికుంట గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ మడకం రవి, బొర్రా రామును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రవాణాదారులు టీఎస్‌ఎండీసీకి సంబంధించిన వే బిల్లులను పోలీసులకు చూపించారు. అవి నకిలీవిగా తేలడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

చింతకాని మండలంలో...
చింతకాని: మండలంలోని చిన్నమండవ గ్రామ సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను గిర్దావర్ సోయం రఘు, వీఆర్వో బ్రహ్మం గురువారం పట్టుకున్నారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎటువంటి కూపన్లు లేకుండా ఇసుకను ఖమ్మం తరలిస్తుండగా పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేశారు.

అశ్వారావుపేట మండలంలో...
అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని ఇసుక క్వారీల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మధు ప్రసాద్ నిఘా వేసి నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

భద్రాచలంలో...
భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను భద్రాచలం పోలీసులు గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు. ఈ కేసులో ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ టీఎస్28 డీ 0988 అనే నెంబర్ గల వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles