ఖమ్మం కల్చరల్: కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే పలు రకాల చేనేత వస్ర్తాలు, హస్త కళలు అబ్బురపరుస్తున్నాయి.. నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ కళాజ్యోతి హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న చేనేత హస్తకళా ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సుమారు వంద స్టాల్స్‌లో అన్ని వర్గాలు, వయసుల వారికి నప్పే చేనేత వస్ర్తాలు, కళా నైపుణ్యాన్ని చాటే హస్త కళలు ప్రదర్శనలో ఉంచారు. వరంగల్, పోచంపల్లి చీరలు మగువల మదిని దోస్తున్నాయి.
కలంకారి, నారాయణపేట, జైపూర్, హర్యానా ఉత్పత్తులు, చెక్కబొమ్మలు, హైద్రా బాద్ ముత్యాలు, సారంగపూర్ ఇంటీరియర్ డెకరేషన్ వస్తువులు, జూట్ బ్యాగులు, ఏటికొప్పాక బొమ్మలు, రాజస్థాన్ బ్లాక్ మెటల్ నగిషీలు, ఆకర్షణీయమైన పలు రకాల వన్‌గ్రామ్ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కళాకారులే ఉత్పత్తి చేసి నేరుగా వినియో గదారులకు విక్రయించే ఈ ఉత్పత్తులు నాణ్యత, తక్కువ ధరలకు లభిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రదర్శన ఈనెల 28 వరకు ఉటుందదని, కనుమరుగవుతున్న గ్రామీణ కళలను ప్రోత్సహించాలని, కళాకారులను ఆదుకోవాలని నిర్వాహకుడు పసుపులేటి వెంకయ్య కోరారు.