భూ ఉపరితల ఆవర్తన ప్రభావం..

Sun,October 20, 2019 03:56 AM

-పాలేరు నియోజకవర్గంలో భారీ వర్షం -ఆందోళన చెందుతున్న రైతులు
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 19: భూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురవగా వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురిశాయి. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సాగు చేసిన పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

గత వారం రోజుల నుంచి ఆయా మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంట మినహా అన్ని పంటలకు ఇబ్బంది కరంగా మారింది. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. గత వారం రోజుల నుంచి పత్తి పంట చేతికి వస్తున్న తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

వీటికి తోడు ఈశన్య రుతుపవనాలు ప్రవేశించడంతో రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులకు మరింత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. గత మూడు రోజుల నుంచి ఖమ్మం నగరంతో పాటు కామేపల్లి, కొణిజర్ల, చింతకాని, నేలకొండపల్లి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పత్తి పంట ఎక్కువగా సాగు చేసిన మండలాల్లో వర్షాలు పడుతుండటంతో అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles