పారదర్శకంగా మద్యం టెండర్ల డ్రా

Fri,October 18, 2019 11:14 PM

-స్వయంగా లాటరీ తీసిన కొత్తగూడెం కలెక్టర్ రజత్ కుమార్
-ఎనిమిదిమంది మహిళలకు దక్కిన దుకాణాలు
-జాతరను తలపించిన నర్కొండకర్ నగర్
-క్షణం క్షణం ఉత్కంఠతతో ఎదురుచూసిన ఆశావహులు
-విజయవంతంగా ముగిసిన 76 మద్యం దుకాణాల టెండర్లు

కొత్తగూడెం క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ... మద్యం వ్యాపారుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. మద్యం దుకాణాలకు ఆశావహులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకు అత్యధిక ఆదాయం చేకూరింది. ఆంధ్రా ప్రాంతం నుంచి సైతం మద్యం టెండర్లకు బారులు తీరడంతో ఈసారి జరిగిన టెండర్లకు ప్రత్యేకత చోటు చేసుకుంది. చుంచుపల్లి మండలం నర్కొండకర్ (ఎన్‌కే)నగర్‌లో గల కమ్మ సేవాసమితి భవన్‌లో శుక్రవారం కలెక్టర్ రజత్ కుమార్ శైనీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు డ్రా నిర్వహించారు. దీనిని కలెక్టర్ ప్రారంభించి, పూర్తయ్యేంత వరకు ఉన్నారు. చివరి వరకు తానే డ్రా తీశారు. మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతారెడ్డి నర్సింహారెడ్డి పారదర్శకంగా నిర్వహించారు. జిల్లాలోని 76 మద్యం దుకాణాలకు మొత్తం 3408 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.68.16కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల సరిహద్దుల నుంచి ఆంధ్రా ప్రాంత వ్యాపారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేయడంతో ఎక్సైజ్ అధికారుల అంచనాకు మించిన ఆదాయం చేకూరింది.

ఎనిమిదిమంది మహిళలకు దక్కిన దుకాణాలు
మద్యం టెండర్లకు పురుషులకు ధీటుగా మహిళలు కూడా పోటీ పడ్డారు. జిల్లాలోని 76 మద్యం దుకాణాలకు సుమారు 25 శాతానికి పైగా మహిళలు టెండర్లకు దరఖాస్తులు చేశారు. డ్రాలో ఎనిమమిదిమంది మహిళలు మద్యం దుకాణాలను చేజిక్కించుకున్నారు. కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాన్ని మాలోతు నాగలక్ష్మి, పాల్వంచ స్టేషన్ పరిధిలోని దుకాణాన్ని చేకూరి కస్తూరి, భద్రాచలం స్టేషన్ పరిధిలోని దుకాణాలను మితికంటి శశిరేఖ, బొల్లు కుసుమ శిరీష, కారం వెంకటమ్మ, మణుగూరు స్టేషన్ పరిధిలోని దుకాణాలను వట్టం స్వరూప, కొమరం కాంతమ్మ, ఇల్లెందు స్టేషన్ పరిధిలోని దుకాణాన్ని దారావత్ నీలావతి దక్కించుకున్నారు.

జాతరను తలపించిన నర్కొండకర్ నగర్
టెండర్ల డ్రా ప్రక్రియ జరిగిన నర్కొండకర్ నగర్‌కు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు, వారి సహచరులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడి వాతావరణం... జాతరను తలపించింది.

నరాలు తెగే ఉత్కంఠ
జిల్లాలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోగల మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 18, పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 10, అశ్వారావుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 9, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 13, మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 13, ఇల్లెందు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 13 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన వారంతా డ్రా పూర్తయ్యేంత వరకు నరాలు తెగేంత ఉత్కంఠకు లోనయ్యారు. ఇందులో ఎక్కువగా ఆదివాసీ, గిరిజనులు ఉన్నారు. భారీగా దరఖాస్తు దారులు రావడంతో వారికి డ్రా నిర్వహించిన ప్రాంగణంలో టెంట్లు వేయడంతో పాటు, వాటి వద్ద డ్రా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్‌ఈడీ టీవీలను అమర్చారు. ఎటువంటి అ వక తవకలకు తావు లేకుండా ఈ ప్రసార విధానం దోహదపడింది.

విజయవంతంగా ముగిసిన డ్రా
ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించారు. ఈ డ్రా కార్యకమాన్ని ఉదయం 11 గంటలకు కలెక్టర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముగించారు. ఈ డ్రా కార్యక్రమానికి కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బత్తుల సత్యనారాయణ, జూలూరుపాడు సీఐ నాగరాజు, సుజాతనగర్ ఎస్సై దురిశెట్టి వరుణ్ ప్రసాద్, చుంచుపల్లి ఎస్సై ఎల్. రవిందర్‌లు ఈ బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించారు. సుమారు 30మంది పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ స్బిబంది, ఎక్సైజ్ సిబ్బందిని కేటాయించారు.

పారదర్శకంగా కేటాయించాం
ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా ఈ మద్యం (ఏ4)దుకాణాల టెండర్లను పారద్శకంగా నిర్వహించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతారెడ్డి నర్సింహారెడ్డి చెప్పారు. డ్రా పూర్తయ్యక, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 76 మద్యం దుకాణాల టెండర్లను పారదర్శకంగా నిర్వహించామన్నా. డ్రాలో ఎంపికైన దరఖాస్తుదారుల పూర్తి వివరాలను సేకరించాకనే దుకాణాలను కేటాయించినట్టు చెప్పారు. నవంబర్ 1న నూతన మద్యం పాలసీ దుకాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ మద్యం దుకాణాలను పాలసీలో జనాభా ప్రాతిపదికన కొత్త మద్యం వ్యాపారుల నుంచి డిపాజిట్లు చేయించుకుంటామన్నారు. డ్రా కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లకా్ష్మనాయక్, డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ నల్లమల శ్రీనివాసరావు, కొత్తగూడెం ఎస్‌హెచ్‌వో నిమ్మ నరేందర్, పాల్వంచ ఎస్‌హెచ్‌వో గురునాధ్ రాథోడ్, మణుగూరు ఎస్‌హెచ్‌వో జె.రామ్మూర్తి, ఇల్లెందు ఎస్‌హెచ్‌వో వేమ రాజశేఖరరావు, అశ్వారావు పేట ఎస్‌హెచ్‌వో జె.నాగయ్య, భద్రాచలం ఎస్‌హెచ్‌వో టి.సత్యనారాయణ పాల్గొన్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles