పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతాం

Sat,October 12, 2019 11:49 PM

- సమ్మెపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆర్టీసీని కాపాడు కుంటామని సంస్థను ప్రైవేట్‌ పరం చేయమని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటం లేదన్నారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు. ప్రభుత్వం పై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు. కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయారన్నారు. సమ్మెను ప్రయాణికుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు. త్వరలోనే అన్ని బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ. 4416 కోట్లు. విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు. టీమ్‌ మిషన్‌లు పని చేయకుండా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం, అసంబద్ధం అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో ఆర్టీసీలో చేస్తున్న సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

178
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles