పండుగపూట విషాదం

Thu,October 10, 2019 12:40 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ : మండలంలోని బారుగూడెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన కొతి దేవేందర్‌రెడ్డి (44), నూతన (40) దంపతులు పండుగపూటైన మంగళవారం వైద్యం కోసం ఖమ్మంలోని దవాఖానకు కారులో వెళ్లుతున్నారు. బారుగూడెం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వారి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ కారును సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. కారులోని దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్రావ్ తెలిపారు.

పండుగపూట భార్యభర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దేవేందర్‌రెడ్డి స్వగ్రామంలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అందరిని కంటతడిపెట్టించాయి. మృతులకు ఒక కుమార్తె ఉంది.

ఎమ్మెల్యే కందాల పరామర్శ
విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి జిల్లా ప్రభుత్వ హస్పిటల్‌లో ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావుల ఫోన్‌లో సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపలి శ్రీథర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు పొతినేని సుదర్శన్, టీఆర్‌ఎస్ నాయకులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మొగిలి శ్రీనివాసరెడ్డి, ఆశోక్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి నివాళ్లుర్పించిన వారిలో ఉన్నారు.

కారేపల్లి మండలంలో బాలుడు మృతి
కారేపల్లి రూరల్ : సింగరేణి మండలంలోని వేరువేరు రోడ్డు ప్రమాదంల్లో ఒక బాలుడు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం రోళ్ళపాడు గ్రామానికి చెందిన కోరం అజయ్(10) అనే బాలుడు బందువులతో కలసి ఆటోలో కోటమైసమ్మ జాతరకు వస్తున్నాడు. ఉసిరికాయలపల్లి ఓసీ ఫీల్టర్ బెడ్ మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలు డు తలకి తీవ్ర గాయం కాగా కోరం వీరభద్రంకు స్వల్పగాయాలు అయ్యా. ఇద్దరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా అజయ్ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మరో రెండు వేరువేరు ప్రమాదాల్లో ఇరువురు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

రెండు బైక్‌లు ఢీ : వ్యక్తి మృతి
సత్తుపల్లి రూరల్ : మండలంలోని కాకర్లపల్లి-సత్తుపల్లి మధ్యలో రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. మండలంలోని సత్యంపేటకు చెందిన పసుపులేటి సైదులు, రాజిన్ని సత్యం, ఇనుపనూరి కోటిలు సత్తుపల్లి నుంచి మోటారుసైకిల్‌పై స్వగ్రామానికి వెళుతున్నారు. బుగ్గపాడులోని గాంధీనగర్‌కు చెందిన వర్సా దుర్గారావు, ఇడుపులపాటి రంగా, కుమారిలు మరో ద్విచక్రవాహనంపై సత్తుపల్లి వస్తున్నారు. ఈ క్రమంలో కాకర్లపల్లి-సత్తుపల్లి మధ్యలో రెండు వాహనాలు ఢీకొనడంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలిస్తుండగా పసుపులేటి సైదులు(35) మార్గమధ్యంలో మృతి చెందాడు.

కొత్తగూడెంలో ఇద్దరు మృతి
చుంచుపల్లి : అతివేగంగా వాహనాన్ని నడిపి ప్రాణాలను తీసుకొని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చిన ఘటన చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి మేడిపల్లి సునీల్ (25), కాకెల్లి దిలీప్ (23) ఇద్దరు సర్వారంలోని మిత్రుడి ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో అతివేగంగా వచ్చి విద్యానగర్ బైపాస్ రోడ్డు వద్ద గల డివైడర్‌ను ఢీకొట్టడంతో దీలీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. సునీల్ సింగరేణి వైద్య ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేడిపల్లి సునీల్ తండ్రి సింగరేణి ఉద్యోగి రైటర్‌బస్తీగొల్లగూడెంలో నివాసం ఉంటున్నాడు. కంచెర్లి దిలీప్ తండ్రి అనిశెట్టి పల్లి నివాసి. చుంచుపల్లి ఎస్సై ఎల్ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పినపాక పట్టీనగర్‌లో వ్యక్తి మృతి
బూర్గంపహాడ్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని పినపాక పట్టీనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొట్టె గోవిందరావు (42) తాపీమేస్త్రీగా పని చేసూ పాల్వంచలో నివాసముంటున్నాడు. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా పినపాక పట్టీనగర్ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గోవిందరావును స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

227
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles