సమస్యలు లేని పంచాయతీలుగా తీర్చిదిద్దుకోవాలి

Thu,October 10, 2019 12:06 AM

-ఇంకుడు గుంతలేని ఇల్లు ఉంటే సహించేది లేదు
రఘునాథపాలెం : 30రోజుల ప్రణాళికలో భాగంగా సమస్యలు లేని గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రథమపౌరులదేనని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. బుధవారం వీడీయోస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 30రోజుల ప్రణాళికపై గ్రామ సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఉపసర్పంచ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించిరాఉ. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని ఏగ్రామంలోనూ ఇంకుడు గుంతలేని ఇళ్లు ఉండకూడదన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంత నిర్మాణం మంచి పరిష్కారమార్గమన్నారు. ఇందుకు ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత తప్పని సరి చేయాలని మంత్రి సర్పంచ్‌లకు సూచించారు. గ్రామ సమస్యలను పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన 30రోజుల ప్రణాళిక మంచి అవకాశమన్నారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, హరితహారం, పెంట కుప్పల తొలగింపు, పాడుబడ్డ బావుల పూడ్చివేత తదితర సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు.

గ్రామంలో ఎంతమంది జనాభా ఉంటే అన్ని చెట్లు నాటుకోవాలన్నారు. అందుకు ప్రత్యేకంగా కడియం నుంచి మొక్కలను తెప్పించుకొని నాటి సంరక్షించాలన్నారు. చేపట్టిన పనులను చిత్రాల రూపంలో బుక్ తయారు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో జరిగిన పనుల పర్యవేక్షణపై ఏడుగురు అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించడం జరిగిందన్నారు. వీ వెంకటాయపాలెం గ్రామానికి రూ.30లక్షలతో వెటర్నరీ ఆసుపత్రి ఆధునీకరణకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రణాళిక పనులు జరగని గ్రామాలపై తగిన చర్యలు తీసుకోబడుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, ఎంపీపీ భుక్యా గౌరి, జెడ్పీటీసీ మాళోతు ప్రియాంక, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles