రాత్రి పది వరకే..

Fri,October 4, 2019 12:36 AM

-ఉదయం పది గంటల నుంచి మద్యం విక్రయాలు
-నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం
-ఈ నెల 31 తో ముగియనున్న షాపుల లైసెన్స్ గడువు
-నవంబర్ 1 నుంచి జిల్లాలో నూతన మద్యం పాలసీ
-దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు

ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లాలోని మద్యం వ్యాపారులకు టెన్షన్ తొలగింది. 2017-19 సంవత్సరాలకుగాను జిల్లాలో 83 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. దీంతో, ప్రభుత్వం రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ విధానంపై పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసిన తరువాత కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న దుకాణాలకు లైసెన్స్ గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించింది. ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ఎక్సైజ్ కమిషనర్ గురువారం హైదాబాద్‌లో ప్రకటించారు. నవంబర్ 1 నుంచి జిల్లాలో కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. జనభా ప్రాతిపదికన లైసెన్స్‌లను ఖరారు చేసింది. 5000 లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు, 5000 నుంచి 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభాగల ప్రాంతాలలో రూ.60 లక్షలు, లక్ష నుంచి ఐదులక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.65లక్షలు, ఐదు లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభాగల ప్రాంతాలకు రూ.85లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలలో రూ.1.10 కోట్లను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. జిల్లాలో ఉన్న 83 మద్యం దుకాణా లైసెన్స్ గడువు అక్టోబర్ 31 తో ముగియనుంది. అక్టోబర్ చివరి వారంలోనే నూతన మద్యం పాలసీ విధానాన్ని టెండర్ల ప్రక్రియ ద్వారా పూర్తి చేసి, నవంబర్ 1 నుంచి అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. మద్యం దుకాణాల వేలం పాటలలో పాల్గొనేందుకు ప్రభుత్వం టెండర్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.

గతంలో దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు ఉండేది. న్రూతన విధానంలో ఇది రెండు లక్షల రూపాయలకు చేరింది. మద్యం దుకాణాల సమయ పాలన పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జిల్లాలో ఉదయం 9.00 నుంచి రాత్రి 11.00 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. నూతన మద్యం పాలసీ ప్రకారంగా... ఉదయం 10.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది. 2017-19 సంవత్సరంలో ఖమ్మంలోని 83 మద్యం దుకాణాలకు 4029 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోనే ఈ సంఖ్య అత్యధికం. జిల్లా ఎక్సైజ్ ఖజానాకు రూ. 40.29 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఆంధ్రా రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలవుతోంది. అక్కడి వ్యాపారులు ఖమ్మం జిల్లాలో వైన్ షాపులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుస్తున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర, ఖమ్మంతో పాటు రూరల్ ప్రాంతాలలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు తమకు పరిచయమున్న దుకాణాదారులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈసారి కూడా జిల్లాలో రికార్డ్ సంఖ్యలో దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా ఇతర వ్యాపారాలలో అంత పురోగతి లేదని భావించిన జిల్లాలోని వ్యాపారులు... మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో నూతన మద్యం విధానం పాలసీ విధివిధానాలు ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

293
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles