మోస్తరు వర్షం

Thu,September 19, 2019 12:56 AM

-37.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
-తిరుమలాయపాలెం మండలంలో అత్యధికంగా 110.2 మి.మీ..
-జలమయమైన ఖమ్మం ప్రధాన వీధులు

ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 18: ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం ఖమ్మం నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన వీధులు జలమయం అయ్యాయి. 40 నిమిషాల పాటు ఏకదాటిగా కురిసిన వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంబించింది. ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో పాదాచారులు, ద్విచక్రవాహనదారులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. వైరారోడ్, ఇల్లందు క్రాస్‌రోడ్, కమాన్‌బజార్, త్రీటౌన్‌లోని గాంధీచౌక్, డీఆర్‌డీఏ ప్రాంతాలలో వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం, ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, ఖమ్మం రూరల్, టీ పాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో భారీ వర్షం కురిసింది. వరి, పత్తి, అపరాల పంటలతో పాటు వాణిజ్య పంటలకు మంచి ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.

నిండు కుండలా వైరా రిజర్వాయర్
వైరా నమస్తేతెలంగాణ : మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ నీటితో తొణికిసలాడుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.03 అడుగులు కాగా ప్రస్తుతం 19.04 అడుగులకు చేరింది. దీంతో అలుగులు ద్వారా వరద నీరు ఉధృతంగా వైరా నదిలోకి ప్రవహిస్తుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్యాచ్‌మెంట్ ప్రాంతాలైన ఏన్కూరు, కొణిజర్ల, కారేపల్లి మండల్లాలోని వాగుల ద్వారా వైరా రిజన్వాయర్‌లోకి వరద నీరు ప్రవహిస్తుంది. మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో వైరా నదిపై ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా గంగదేవిపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వైరా మండలంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 3.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

స్తంభించిన జన జీవనం
మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఎకదాటిగా సుమారు 2 గంటలు కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో వైరాలోని రాష్ట్రీయ రహదారి, వైరా-మధిర ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షంనీరు నిలిచిపోయింది. అదేవిధంగా పల్లపు ప్రాంతంలో ఉన్న మధిర రోడ్డులోని సైదులుస్వామి దర్గా ఆవరణ, టీఎస్‌ఆర్‌ఎస్ ఆవరణ, వైరా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు భారీ స్థాయిలో నిలించింది. మండలంలో వరి పంట సాగు చేసే రైతులకు ఈ వర్షం సానుకూలంగా మారగా చేతికి రావాల్సిన పెసర పంటలు వర్షం వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వైరాలోని రేచర్లబజార్, బ్రాహ్మణపల్లితో పాటు పలు ప్రాంతాల్లోని రోడ్లుపై భారీగా నీరు నిలిచిపోయింది.

మత్తడి పోస్తున్న మధిర పెద్దచెరువు..
మధిర, నమస్తేతెలంగాణ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో మధిర పెద్దచెరువు నిండి మత్తడి పోస్తుంది. నియోజకవర్గంలో భారీవర్షం కురవడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుకుండను తలపిస్తున్నాయి. వైరానదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువుల్లోని పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించడంతో చెరువుల్లోకి భారీగా నీరుచేరింది. దీంతో ఆయా చెరువుల కింద రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండటంతో వరినాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పత్తి పైపాటు దశలో ఉండి కళకళలాడుతుంది. అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భక్తరామదాసు కింది చెరువులకు జలకళ
కూసుమంచి: భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పరిధిలోగల చెరువులకు జలకళ సంతరించుకుంది. కృష్ణానది ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్టాలలో భారీవర్షాలు కురిసి, నాగార్జునసాగర్ సహా పలు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరుచేరింది. దీంతో ప్రభుత్వం నెలరోజుల క్రితం సాగర్ రెండో జోన్‌కు నీరువిడుదల చేసింది. గతనెల మొదటివారంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కలెక్టర్ కర్ణన్‌తో కలిసి, మోటార్లు ఆన్‌చేసి, నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌కు భారీగా నీరురావడంతో భక్తరామదాసు పథకం పరిధిలోగల 97 చెరువులను నింపడానికి అధికారులు పూర్తిస్థాలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 48 చెరువులు అలుగుపోస్తుండగా, మిగతా చెరువులు 50 నుంచి 80 శాతం వరకు నిండాయని ఐబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఖరీప్‌తో పాటు వచ్చే రబీసీజన్‌లో కూడా నియోజవకర్గంలో నీటి కొరతలేకుండా, వివిధ పంటల సాగుకు అనుకూలపరిస్థితి ఉంటుందని రైతాంగం ఆశాభావం వ్వక్తం చేస్తున్నారు.

అలుగుపోస్తున్న చెరువులు...
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ : బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు చెరువులకు వరదనీరు వచ్చి చేరుతోంది. మండలంలోని తల్లంపాడు, ఏదులాపురం, కొండాపురం చెరువు, పొన్నెకల్లు చెరువులు ఆలుగుపోస్తుంది. గోళ్లపాడు, పోలేపల్లి చెరువులు సైతం పూర్తిస్థాయిలో నిండటంతో రేపోమాపో అలుగు పడే అవకాశం ఉంది.

వరదనీటితో నిండిన శ్రీరాం నగర్
మండలంలోని ఏదులాపురం పరిధిలో గల శ్రీరాంనగర్ వరదనీటితో నిండింది. కాల్వలు ఆక్రమణకు గురికావడంతో వరదనీరు వెళ్లే పరిస్థితిలేక నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడు వెంపటి రవి మాట్లాడుతూ.. వరదనీటితో కాలనీ చెరులా మారిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles