246 కేజీల గంజాయి స్వాధీనం రవాణా గుట్టురట్టు..

Sat,September 14, 2019 12:19 AM

-కొబ్బరిబొండాల లోడులో అక్రమంగా తరలింపు
-వాహన పల్టీతో బయటపడిన స్మగ్లింగ్
-దీని విలువ రూ.7.38 లక్షలు

కారేపల్లి రూరల్ : కొబ్బరిబొండాల పేరుతో గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తూ ప్రమాదవశాత్తు ట్రక్ బోల్తాపడడంతో పట్టుబడిన సంఘటన శుక్రవారం సింగరేణి మండలంలోని గాంధీనగరం వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. కొబ్బరిబొండాల లోడుతో వస్తున్న ఏపీ 28 వై 4823 నెంబర్ గల బొలేరో ట్రక్ వాహనం శుక్రవారం తెల్లవారుజామున గాంధీనగరం రైల్వేగేట్ సమీపంలో చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీనిని ఉదయం గమనించిన గ్రామస్తులు దగ్గరకు వచ్చి చూడగా కొబ్బరిబొండాలతో పాటు ప్యాకెట్లు కనిపించాయి. ట్రక్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్యాకెట్లను పరిశీలించగా గంజాయిగా తేలింది. వెంటనే గ్రామస్తులు సింగరేణి పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం 246 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా బొండాల లోడులో..
గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తరలించడానికి స్మగ్లర్లు కొబ్బరి బొండాల పేరుతో ట్రక్‌లో బొండాల కింద ఎగుమతికి ఎత్తు వేశారు. పైకి చూడడానికి కొబ్బరిబొండాలను తరలిస్తున్నట్లు కనిపిస్తుండడం ఎవరికి అనుమానం రాదని స్మగ్లర్ల ఆలోచన. గంజాయి తరలించే వాహనం బోల్తాతో స్మగ్లర్ల గుట్టు రట్టయింది. సంఘటనాస్థలాన్ని సింగరేణి సీఐ బీ శ్రీనివాసులు, తహసీల్దార్ సీహెచ్ స్వామి, కారేపల్లి ఎస్సై పొదిల వెంకన్నలు పంచనామా నిర్వహించి గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. బొలోరో ట్రక్‌లో 137 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్యాకెట్ 1.8 కేజీల బరువు ఉంది. మొత్తం 246 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని దీని విలువ సుమారు రూ.7.38 లక్షలు ఉంటుందని సీఐ బీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయిని ఒడిసా ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో వాహనం ప్రమాదానికి గురైందని సీఐ పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న వాహనం నెంబర్ ప్లేట్ ఏపీ28 వై 4823 అని ఉన్నా అది నకిలీదై ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాహనం కర్ణాటకకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles