48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి

Wed,June 12, 2019 12:07 AM

-ఆర్‌ఎంఓను ఆదేశించిన అసిస్టెంట్ కలెక్టర్ కొడింబా
-సెక్యూరిటీ గార్డుకు వైద్యంలో శిక్షణ ఏమైనా ఇచ్చారా?
-సుఖ ప్రసవాలలో జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రథమం
-అదే స్ఫూర్తితో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పనిచేయాలి
-సెక్యూరిటీ గార్డు స్లైన్ ఎక్కించిన ఘటనపై విచారణ
-వైద్యులు, నర్సులు, శానిటేషన్ సూపర్‌వైజర్లపై ఆగ్రహం
మయూరిసెంటర్, జూన్ 11: జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలోని మాతా శిశు విభాగంలో సెక్యూరిటీ గార్డు అక్కడి రోగులకు స్లైన్ ఎక్కించిన ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంఓ డాక్టర్ కృపా ఉషశ్రీని అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సెక్యూరిటీ గార్డు వైద్యం అందించిన ఘటనపై మంగళవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు, ఆర్‌ఎంవో, నర్సింగ్ సూపరిటెండెంట్, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, పేషెంట్ కేర్ టేకర్లు, శానిటేషన్ విభాగ సూపర్‌వైజర్‌లను పిలిచి విచారించారు. ఈ నెల 9న మాతాశిశు విభాగంలో ఓ బాలింతకు ఓ సెక్యూరిటీ గార్డు ఎక్కించిన ఘటనపై ఈ నెల 10న వైద్యవిధాన పరిషత్ విజిలెన్స్ అధికారి డాక్టర్ రాజశేఖర్‌బాబు విచారణ చేసిన విషయం విదితమే.

దాంతోపాటు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ కూడా విచారణకు ఆదేవించారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా మంగళవారం సుమారు రెండు గంటలపాటు వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి చెందిన ఫైళ్ళను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆ రోజు జరిగిన అంశాలపై ప్రభుత్వ వైద్యులు, ఆర్‌ఎంవో, నర్సింగ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాలని సూచించారు. సాధారణ ప్రసవాలు జరపడంతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉండటం సంతోషదాయకమని, అదే స్ఫూర్తితో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పని చేసి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న నర్సింగ్ సిబ్బంది, పేషెంట్ కేర్ సిబ్బందిని పిలిచి విచారించారు. వైద్య సిబ్బంది విధుల్లో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 15న నీతీ ఆయోగ్ కేంద్ర వైద్య బృందం ఖమ్మం జిల్లా వైద్యశాల సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులను దిశానిర్దేశం చేశారు. విచారణ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వివరించారు. 48 గంటల్లో సమగ్ర నివేదికను తీసుకుని కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు.

శానిటేషన్ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం..
జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ పుల్లయ్యపై అసిస్టెంట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డులకు వైద్య విభాగంలో ఏమైనా ప్రత్యేక శిక్షణను అందించారా? అంటూ మందలించారు. రోగులకు వైద్యసేవల అంశంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత నర్సులకుగానీ, నర్సింగ్ సూపర్‌వైజర్‌కు కానీ, పేషెంట్ కేర్ సిబ్బందికి కానీ విషయాన్ని తెలియపర్చాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులు తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లా వైద్యశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. అలా కాకుండా తానే వైద్య విద్యను అభ్యసించినట్లుగా భావించి రోగికి స్లైన్ పెట్టడం సరైంది కాదని సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై ఉందని అన్నారు.

కలిసి కట్టుగా పనిచేయాలి..
పాత, కొత్త భవనాలలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది కలిసి కట్టుగా పనిచేస్తూ మరోసారి ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకునే విధంగా కృషి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లా వైద్యశాలకు ఇప్పటికే రెండు సార్లు కాయకల్ప అవార్డు గొప్పవిషయమని అన్నారు. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఎలాంటి వివాదాస్పద చర్యలకూ పాల్పడవద్దని సూచించారు.

246
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles