మూడు ఎన్నికల్లో మువ్వా మార్క్‌..

Thu,May 16, 2019 01:14 AM

-విజయబాబు భుజస్కంధాలపై సత్తుపల్లి నియోజకవర్గం
-మంచికి మారుపేరుగా, కల్మషంలేని నేతగా ఎదిగిన మువ్వా విజయ్‌బాబు
-అణుకువ, నేర్పరితనంతో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, మే 15: మువ్వా విజయ్‌బాబు.. జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరున్న నాయకునిగా ఎదిగిన యువనేత. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు నేటి యువతకు ఆదర్శప్రాయమనే చెప్పాలి. సొసైటీ అధ్యక్షుడి నుంచి నేడు రాష్ట్రస్థాయిలో అప్కాబ్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు ఎదిగిన మువ్వా తనకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని మామగారు, బాబాయి అంటూ అప్యాయంగా వరుసలతో పిలవడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విశేషమైన జ్ఞాపకశక్తితో పాటు విస్తృతమైన పరిచయాలు కలిగి ఉన్న మువ్వా రాజకీయ ఆరగేంట్రంలో రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ ఎంతో కీలకం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేతగా రాష్ట్ర స్థాయి అగ్రనేతల సరసన నిలిచిన మువ్వా నేటికి స్వగ్రామాన్ని, సన్నిహితులను విడిచి ఉండలేరు. తన తల్లి చేతి పెరుగున్నం తనకు ఎంతో ఇష్టమో, లంకపల్లి గ్రామం, పెనుబల్లి మండలమన్నా ఆయనకు ఎంతో మక్కువ.

పిడమర్తి గెలుపు కోసం అలుపెరగని కృషి...
స్థానిక నేతగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సొంత మనిషిలా జిల్లా రాజకీయాలను చక్కబెడుతూనే గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా తనదైన శైలిలో రాణించారు. మువ్వా మార్క్‌ రాజకీయాలు ‘నొప్పించక ఒప్పించే’ రీతిలో ఉంటాయనే ప్రచారం ఊపందుకుంది. గ్రామ, గ్రామాన మండుటెండల్లో స్వంత అభ్యర్థిత్వం కన్నా మిన్నగా అలుపెరగని కృషి చేసిన మువ్వా పిడమర్తి రవికి సుమారు 80వేల ఓట్లు పోలయ్యే విధంగా పనిచేశారు. ట్రక్కు గుర్తుతో పాటు పలు కారణాలతో పిడమర్తి రవి ఓటమి పాలు కావడంతో నైతిక బాధ్యతతో ఉన్నత విలువలు కలిగిన తన డీసీసీబీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం నియోజకవర్గంలో పంచాయతీలను గెలుపు బాట పట్టించి గులాబీ జెండాను ఎగరవేయడంలో కీలకపాత్ర పోషించారు.

ముందస్తు కార్యాచరణతో చాలా వరకు పంచాయతీలను ఏకగ్రీవం చేయగలిగిన ఘనాపాటిగా మువ్వా పేరొందారు. రాజకీయమే వ్యాపకంగా ప్రజాసేవలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సర్పంచ్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. వీలునన్ని ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంతో పాటు రెబల్స్‌ బెడదను చాలా వరకు నివారించడంతో పాటు వాటికి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను అన్వేషించి ముచ్చటగా మూడు ఎన్నికల్లో ‘మువ్వా’ మార్క్‌ను చాటుకున్నారు. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ నాటికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం అధికారపార్టీకి ఆకర్షితుడు కావడంతో వీరిద్దరి వ్యూహంతో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో మువ్వా, సండ్రల వ్యూహం పట్ల ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు. నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలను గులాబీ ఖాతాలో వేసినట్లేనని రాజకీయ విశ్లేషకుల నడుమ చర్చ సాగుతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి రాజధాని స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన మువ్వా స్వశక్తినే యుక్తిగా, శక్తిగా మలుచుకున్న భావినేతగా ఎదుగుతూ వచ్చారు.

196
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles