మూడవ విడత ఎన్నికలు ప్రశాంతం

Wed,May 15, 2019 01:51 AM

మామిళ్లగూడెం:స్థానిక సంస్థల జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల మూడో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. అధికారులు ఏర్పాటు చేసిన పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో 7 మండలాలలోని 509 పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల వరకు జరిగింది. 7 మండలాలో ఓటింగ్‌ సరళిని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రియాంక పరిశీలించారు. వేసవికాలం కావడంతో ఓటర్లు ఉదయమే పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం కాస్త మందగించినప్పటికి సాయంత్రం 4 గంటల తరువాత ఓటర్లు మరోసారి పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకే ముగించాల్సిన పోలింగ్‌ ప్రక్రియను అధికారులు పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఓటర్ల అందరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక వీడియోగ్రాఫర్లు, సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ చిన్నిచిన్న సంఘటనలు జరిగినప్పటికి పోలీస్‌లు అప్రమత్తంతో వాటిని నివారించారు. జిల్లాలో మూడో దశలో 7 మండలాలలో ఉన్న 92 ఎంపీటీసీ స్థానాలలో ఒక ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కావడంతో 91 ఏంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

మూడోవ దశ ఎన్నికల కోసం 509 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వాటిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక 318 పోలింగ్‌ కేంద్రాలలో గట్టి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మూడో దశ ఎన్నికలకు 7 మండలా లలో 2,46,478 మంది ఓటర్లు ఉండగా 2,13,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన 7 మండలాలలో రఘునాథపాలెం మం డలంలో 89.73 శాతం నమోదు కావడంతో అత్యధిక ఓటింగ్‌ నమోదైన మండలంగా మొదటి స్థానంలో ఉంది. అలాగే ఎర్రుపాలెం మండలంలో 83.10 శాతం నమోదు కావడంతో ఓటింగ్‌ జరిగిన మండలాలలో చివరి స్థానంలో ఉంది. స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు జిల్లాలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికల పోటీ చేశాయి. బ్యాలెట్‌ ద్వారా జరగనున్న ఎన్నికలకు ఎంపీటీసీ స్థానానికి గులాబీ రంగు బ్యాలెట్‌, జడ్పీటీసీ స్థానా లకు తెలుపు రంగు బ్యాలెట్‌లను విడివిడిగా బ్యాలెట్‌లను వినియోగించారు.

అదే విధంగా జిల్లాలో కీలకమైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో అన్ని జడ్పీటీసీలు గెలుచుకుని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి దక్కించుకుంటామని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తుంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజేర్వేషన్‌ కావడంతో రాజకీయ వర్గాలు ఆ దిశగా ప్రచారం నిర్వహించారు. ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయిన రెండు జడ్పీటీసీ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్షాలన్ని కూటమి కట్టినప్పటికి కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి కూటమి పక్షాలు మద్దతు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోవడంతో పాటు ఓటర్ల దగ్గరకు ముఖ్యమైన నాయకులు వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ప్రధాన నాయకుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మూడోవ విడత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీ చేసి అభ్యర్థుల భవిష్యత్‌ బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలను చేయడంతో పోలీసులు చొరవతీసుకుని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న గొడవలను సద్దుమనిగించారు.

మూడోవ విడతలో 86.47 శాతం పోలింగ్‌ నమోదు
మూడో విడతలో జిల్లాలో మండల, జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. మూడోవ విడత పోలింగ్‌కు 611 మంది పీఓలు, 611 మంది ఏపీఓలు, 2,310 మంది పీఓపీలు ఆయా పోలింగ్‌ కేంద్రాలలో విధులు నిర్వహించారు. 80 మంది సూక్ష్మపరిశీలకులు ఎన్నికల సరళిని పరిశీలించారు. 122 కేంద్రాలలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ చేశారు. 65 కేంద్రాలలో ప్రత్యేక వీడియోగ్రాఫర్ల ద్వారా పోలింగ్‌ సరళని చిత్రీ కంరించారు. ఈ దశలో 7 జడ్పీటీసీలకు, 91 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. పది రోజుల పాటు గ్రామాలలో ప్రచారం హోరెత్తించిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. మూడోవ దశలో వైరా, కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మండలాలో ఎన్నికలు ముగిశాయి. ఈ విడతలో ఎర్రుపాలెం మండలంలో జమలాపురం ఎంపీటీసీ స్థానం టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామంలో కేవలం జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు.బోనకల్‌, చింతకాని, మధిర, రఘునాథపాలెం, ఎర్రుపాలెం మండలాలలో 8 మంది ట్రాన్స్‌జండర్‌లు ఉన్నప్పటికి వారు ఓటు హక్కును వినియోగించుకోలేదు.

బ్యాలెట్‌ బాక్సుల్లో భవిష్యత్‌ భద్రం...
మూడోవ విడత ఎన్నికలు ముగిసిన తరువాత ఈ నెల 27న జరగనున్న కౌంటింగ్‌ కోసం పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను లెక్కింపు కేంద్రాలకు పోలీస్‌ భద్రత మధ్య తరలించారు. 91 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 259 మంది ఎంపీటీసీ అభ్యర్థుల, 7 జడ్పీటీసీ స్థానాలకు పోటీచేసిన 30 మంది జడ్పీటీసీ అభ్యర్థుల భవిష్యత్‌ను బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి. బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన అత్యంత భద్రతల మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌కు తర లించారు. చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను కొణిజర్ల మండలంలోని తణికెళ్ల వద్ద ఉన్న గ్రేస్‌ జూనియర్‌ కళాశాలలో అత్యంత భద్రతల మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles