నీలి విప్లవ లక్ష్యలు సాధించాలి

Wed,May 15, 2019 01:48 AM

కూసుమంచి,మే14: దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నిర్దేశించిన నీలి విప్లవ లక్ష్యాల సాధనకు కృషిచేయాలని మండల పరిధిలోని పాలేరు మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్త జీ.విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. తొమ్మిది రాష్ర్టాలకు చెందిన 25 మంది ప్రతినిధులకు మత్స్య పరిశోధన కేంద్రంలో నెలరోజుల పాటు నిర్వహించే శిక్షణను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చేపల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే వివిధ రాష్ర్టాల ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఆక్వా క్లీనిక్స్‌, ఆక్వా పినర్షిస్‌ అనే అంశాలపై నెలరోజుల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్షేత్రస్థాయి సందర్శన, సమీకృత చేపల పెంపకం, చేపల ఉత్పత్తి కేంద్రాలపై అవగాహన, ఆక్వా ఫోనిక్స్‌ తదితర అంశాలపై వారికి అవగాహణ కల్పించడంతో పాటు ప్రాజెక్టు రిపోర్టు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. హైదారాబాద్‌కు చెందిన జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ ఆర్థిక సహకారంతో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈశిక్షణలో పాల్గొని, సర్టిఫికెటు పొందిన వారికి మత్స్య అభివృద్ధి మండలి నుంచి 50 శాతం సబ్సిడీతో రుణాలు లభిస్తాయని చెప్పారు.

మత్స్య పరిశోధన సంస్థ మరో శాస్త్రవేత్త టీఎస్‌ దేవానంద్‌ మాట్లాడుతూ.. శిక్షణలో పాల్గొన్న వారు తాము చెప్పే అంశాలను నిశితంగా పరిశీలించి, చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు తమ వంతు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈశిక్షణ పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందిన వారు చేపపిల్లల కేంద్రాలు, ఆక్వా సెంటర్లు, ఆక్వా క్లినిక్‌లు స్థాపించవచ్చని తెలిపారు. మరోశాస్త్రవేత్త పీ.శాంతన్న మాట్లాడుతూ.. శిక్షణ లక్ష్యాలను వివరించారు. నెల రోజుల పాటు శ్రద్ధతో నేర్చుకుని, ప్రభుత్వం ఆర్థిక సహాయంతో మత్స్య పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందడానికి ఇది మంచి అవకాశమని తెలిపారు. చేపల ఉత్పత్తి, యాజమాన్యంలో అనుసరించాల్సిన పద్దతులను ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం ద్వారానే ఈరంగంలో రాణించడానికి వీలుంటుందన్నారు. చేపల ఉత్పత్తికి అనువైన నీటి వనరులు, చేపల రకాల ఎంపిక, వ్యాధులనివారణ, మార్కెటింగ్‌ వంటివే దీనిలో ప్రధానమైనవని చెప్పారు. నెల రోజుల్లో అనేక అంశాలపై తాము ఇచ్చే తర్ఫీదును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈశిక్షణ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, అస్సాం రాష్ర్టాల నుంచి ఒక్కొక్కరు, బీహార్‌ నుంచి నలుగురు, పశ్చిమ బెంగాల్‌ నుంచి అయిదుగురు హాజరయ్యారు. శిక్షణకు ప్రతినిధులు మత్స్యశాఖ సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు, ఫీల్డ్‌ మేనేజర్లు, కోఆర్డినేటర్లు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, ఆక్వా క్లినిక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles