ఖమ్మంలో క్రికెట్ సమరం..!

Fri,April 26, 2019 12:35 AM

- నేటి నుంచి పీపీఎల్ టోర్నీ..
- మే 3 వరకు కొనసాగనున్న డే అండ్ నైట్ మ్యాచ్‌లు
- ముస్తాబైన సర్దార్ పటేల్ స్టేడియం
- క్రీడాభిమానులకు వినోదం..

(మయూరిసెంటర్) ఈ వేసవి సెలవుల్లో క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులకు, విద్యార్థులకు ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియం క్రీడా ఉత్తేజాన్ని నింపనుంది. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు పువ్వాడ ప్రీమియర్ లీగ్-2 ఇందుకు దోహదం కానుంది. వేసవి సెలవుల్లో 9 రోజులపాటు డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం సాయంత్రం ప్రారంభం కానుంది. క్రీడాకారులకు, ఈ పోటీలను ఆసక్తిగా తిలకించే క్రీడాభిమానులకు ఈ స్టేడియం కనువిందుకానుంది. జాతీయస్థాయి క్రీడా పోటీలలో భాగంగా ఈ క్రికెట్ పోటీలను ఖమ్మంలో పీపీఎల్-2 ఆధ్వర్యంలో పువ్వాడ ఉదయ్‌కుమార్ స్మారకార్థం నిర్వహిస్తున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది.

టీ-ట్వంటీ ఫార్మాట్‌లో..
టీ-ట్వంటీ ఫార్మాట్ క్రికెట్ టోర్నీ మహా సంగ్రామానికి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వేదిక సన్నద్ధమవుతోంది. స్థానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్‌కుమార్ జ్ఞాపకార్థం పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు పువ్వాడ ప్రీమియర్ లీగ్ అని నామకరణం చేసిన విషయం విదితమే. ఈ నెల 26వ తేదీ నుంచి మే నెల 3వ తేదీ వరకూ వివిధ రాష్ర్టాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులు; ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి క్రికెట్ క్రిడాకారులు సైతం ఈ పోటీలలో పాల్గొననున్నారు. పటేల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో డే అండ్ నైట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆయా జట్లకు పలు ప్రైవేట్ కంపెనీలు ప్రాంచైజీలుగా వ్యవహరించనున్నాయి.

ఒక్కో జట్టుకు మొత్తం 16 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల జట్లలో పదిమంది క్రీడాకారులు తప్పనిసరిగా స్థానికులే ఉండాలి. మిగతా ఆరుగురు క్రీడాకారులు ఇతర జిల్లాల నుంచి కూడా ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహించవచ్చు. మ్యాచ్ జరిగే సందర్భంలో మొత్తం 11 మంది క్రీడాకారుల్లో ఏడుగురు స్థానికులు, మిగిలిన నలుగురు స్థానికేతరులు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో తొమ్మిది రోజులపాటు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు, ప్రతిమ్యాచ్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు పట్టణాల ప్రజలకు పీపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియా కో ఆర్డినేటర్‌గా అబ్బాస్ వ్యవహరించనున్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ప్రత్యేకం..
ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 28 వరకు ఖమ్మంలో జరగనున్న డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ప్రత్యేకం. టోర్నీ నిర్వాహకులు మసూద్ నేతృత్వంలో చేకూరి వెంకట్, కేఎంసీ డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, చావా నారాయణరావు, టీఆర్‌ఎస్ నేతలు బుర్రి వినయ్‌కుమార్, రుద్రగాని ఉపేందర్, కమిటీ సభ్యులు ఫారూక్, సందీప్‌లు నిర్వహణ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

216
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles