పరిషత్ ఎన్నికలకు.. నేటినుంచి రెండో విడుత నామినేషన్లు

Fri,April 26, 2019 12:34 AM

(మామిళ్లగూడెం) రెండో విడత జిల్లా, మండల ప్రజా పరిషత్‌ల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దీంతో జిల్లాలో మరోసారి ఎన్నికల రాజకీయం వేడెక్కనుంది. ఇప్పటి వరకూ జరిగిన ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లు వరసగా మూడుసార్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. 4వ సారి స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు సైతం ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అధికారులకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియనిబంధనలపై శిక్షణలను పూర్తి చేశారు. ఎన్నికల నియమనిబంధనలకు సంబంధించిన కరదీపికలను, ఇతర సామగ్రిని అధికారులు మండల కేంద్రాలకు పంపించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కొనసాగుతోంది. బ్యాలెట్ ద్వారా జరగనున్న ఎన్నికలకు ఎంపీటీసీకి గులాబీ రంగు, జడ్పీటీసీలకు తెలుపురంగు బ్యాలెట్‌లను విడివిడిగా వినియోగించనున్నారు. నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసినప్పటికీ హార్డ్ కాపీని మాత్రం స్థానిక ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంది. నామినేషన్లకు అవసరమైన సామగ్రి, బందోబస్తు మండల కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. ఎంపీటీసీలు, ఎంపీపీ, .జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు గెజిట్ ద్వారా ప్రకటించారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో రాజకీయ వర్గాలు ఆ దిశగా సమరానికి సిద్ధం అవుతున్నాయి. జడ్పీ పీఠాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

రిజర్వేషన్లు ఇలా..
రెండో విడత ఎన్నికల జరగనున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు కలెక్టర్ కసరత్తును పూర్తి చేసి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి అనుమతులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియలను కమిషనర్ పూర్తి చేసి ప్రభుత్వ అనుమతులను పొందిన తరువాత రిజర్వేషన్లను గెజిట్ ద్వారా ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల ఎంపిక, ప్రతి ఎంపీటీసీ స్థానానికి 400కు తక్కువ కాకుండా ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, మరికొన్ని 600 పైన ఓటర్లు ఉన్న వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఫలితాలు మే 27న ఉదయం 8 గంటల నుంచి ప్రకటించనున్నారు.

రెండో విడతలో..
రెండో దశలో 6 జడ్పీటీసీ స్థానాలకు, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ఈ నెల 26 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 28వ తేదీని నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. 29న స్క్రూట్నీ చేస్తారు. 30న నామినేషన్లపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. మే 1న నామినేషన్లలో తప్పులున్న వాటిని, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. మే 2న ఉపసంహరణ పత్రాలను స్వీకరిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రానికి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10న రెండో విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఈ దశలో జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాలో ఎన్నికలు జరగనున్నాయి.

206
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles