సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా.. !

Thu,April 25, 2019 02:53 AM

మయూరిసెంటర్, ఏప్రిల్ 23: జిల్లాను సంపూర్ణ ఆరోగ్య ఖమ్మంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బీ కళావతిబాయి పేర్కొన్నారు. బుధవారం ఆమె నమస్తే తెలంగాణతో ముచ్చటించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగస్వామ్యులమయ్యేందుకు వైద్యారోగ్యశాఖ నూటికి నూరు శాతం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలలో భాగంగా కేసీఆర్ కిట్, కంటివెలుగు వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు జరిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని అన్ని పీఎస్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అనే పదం పోయి కార్పొరేట్ స్థాయిలో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులను ఆరోగ్యశాఖకు కేటాయించి గర్భీణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

నమస్తే తెలంగాణ : కంటి వెలుగు కార్యక్రమం వివరాలు ఏమిటి.?
డీఎంహెచ్‌వో : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేశాం. కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం 98 శాతం పూర్తయింది. కంటి సమస్యతో బాధపడుతున్నవారికి కంటివెలుగు కార్యక్రమం కంటి సమస్య బాధితులకు వరంగా మారింది. 2018 ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమంతో బడుగు, బలహీనవర్గాల ప్రజలతో పాటు అందరికి ఈ కార్యక్రమం దోహదపడింది. గతంలో కంటి అద్దాలు నూటికి 80 శాతం మంది ప్రైవేట్ వైద్యశాలలను సంప్రదించి కొనుక్కునేవారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి కంటి సమస్య ఉన్నవారిని గుర్తించి కంటి అద్దాలు అవసరమున్నవారికి అద్దాలను ఉచితంగా అందించి వారికి కంటి అద్దాల ద్వారా మెరుగైన చూపును అందించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. అన్ని పీఎస్‌సీ సెంటర్లతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దూరదృష్టి కోల్పొయిన 88,397 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 56,157 మందికి కంటి అద్దాలను అందజేశాం. నూటికి 98 శాతం మందికి కంటి అద్దాలు చేరాయి.

నమస్తే తెలంగాణ : పీఎస్‌సీ సెంటర్లలో మందుల వివరాలు ఏమిటి.?
డీఎంహెచ్‌వో : అన్ని పీఎస్‌సీల్లో పాము, తేలు, కోతి, కుక్కకాటుకు చెందిన మందులు అందుబాటులో ఉంచాం. గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లేవారికి ఏదైన ప్రమాదం జరిగితే సమీప పీహెచ్ సెంటర్లలో ఈ మందులు అందుబాటులో ఉన్నాయి. పెరిగిన ఎండల నేపథ్యంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. ఎప్పటికప్పుడు 26 పీఎస్‌సీ సెంటర్‌లు, 224 సబ్ సెంటర్‌లలో మందుల వివరాలు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలు ప్రసవం పొందితే మగ బిడ్డకు రూ.12 వేలు, ఆడబిడ్డకు రూ.13వేలతో పాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నాం.

నమస్తే తెలంగాణ : టీబీ వ్యాధి నివారణ చర్యలు వివరించండి..?
డీఎంహెచ్‌వో : మూడు వారాల కంటే మించి దగ్గు విపరీతంగా వస్తూ.. జ్వరం ఉన్నవారిని గుర్తించి వారికి టీబీ నిర్థారణ పరీక్షలను చేయిస్తున్నాం. టీబీ వ్యాధి లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నాణ్యమైన మందులు అందిస్తున్నాం. జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనలో సఫలీకృతలయ్యాం. గ్రామీణ ప్రాంతాలలో దురఅలవాట్లు, ఆల్కాహాల్, ఇతర అలవాట్ల కారణంతో టీబీ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

నమస్తే తెలంగాణ : మీరు డీఎంహెచ్‌వోగా బాధ్యతలు ఎప్పడు చేపట్టారు..?
డీఎంహెచ్‌వో : గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టాను. సూర్యాపేటలో సివిల్ సర్జన్‌గా పని చేసి డిప్యూటీ ప్రాజెక్టు మెడికల్ ఆఫీసర్‌గా (నేషనల్ హెల్త్ మిషన్) అధికారిగా విధులు నిర్వహించి డీఎంహెచ్‌ఓగా విధులను నిర్వహిస్తున్నాను. నాన్ కమ్యూనికేబుల్ డిసీస్‌లను గుర్తించి 70 శాతం వరకు వారికి సేవలను అందించాం. బీపీ, షుగర్, క్యాన్సర్ సంబంధిత వ్యాధుల లక్షణాలను గుర్తించేందుకు, మాతా శిశుసంరక్షణ కోసం మా విభాగం పని చేస్తుంది.

నమస్తే తెలంగాణ : అనుమతుల్లేని ప్రవేట్ వైద్యశాలపై ఏమైనా చర్యలు తీసుకున్నారా.?
డీఎంహెచ్‌వో : జిల్లా వ్యాప్తంగా 456 ప్రైవేట్ వైద్యశాలలున్నాయి. అందులో భాగంగా ఖమ్మం నగరంలో 326 వైద్యశాలలున్నాయి. ఇటీవల ప్రభుత్వ నిబంధనలు పాటించని నగరంలోని వైరా రోడ్ ప్రాంతంలో మూడు ప్రైవేట్ వైద్యశాలలను సీజ్ చేశాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి త్వరలో నిబంధనలు పాటించని ప్రైవేట్ వైద్యశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నాణ్యతా ప్రమాణాలు పాటించి అర్హత కలిగిన వైద్యులతో ప్రైవేట్ వైద్యశాలలను నడపాలి.

నమస్తేతెలంగాణ : స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా.?
డీఎంహెచ్‌వో : ఖమ్మం జిల్లాలో 97 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వ నిబంధనలకు లోబడి స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పనిచేయాలి. తల్లి గర్భంలో ఆడ లేదా మగ శిశువా అని తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. నగరంలో సుమారు 40 నుంచి 50 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ నిబంధనలు ఇప్పటి వరకు అతిక్రమించినట్లు మా దృష్టికి రాలేదు. లింగనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం.

204
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles