పరిషత్ సందడి షురూ..!

Wed,April 24, 2019 01:35 AM

-రెండవ రోజు ఎంపీటీసీ స్థానాలకు 47,
-జెడ్పీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు
-నేటితో ముగియనున్న తొలివిడుత ఎన్నికల నామినేషన్ల ఘట్టం
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల షెడ్యూల్ రావడం, మూడు విడుతలుగా జిల్లాలో పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండడం, బుధవారంతో తొలి విడుత ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తికానుండడంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. జిల్లాలో తొలి విడుత దుమ్ముగూడెం, చర్ల, టేకులపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో ఏడు జెడ్పీటీసీలకు, 82 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలి రోజు దుమ్ముగూడెం జెడ్పీటీసీ స్థానానికి ఒకటి, అశ్వాపురం జెడ్పీటీసీ స్థానానికి ఒకటి, 11 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో తొలివిడుత ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తికానుండటంతో ఆయా గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు పార్టీ గుర్తులతో పోటీ చేయనుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ప్ర క్రియ కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ నుం చి పోటీ చేసేందుకు ప్రతీ గ్రామం నుంచి ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు.

టిక్కెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు
అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రహాసనంగా మారింది. సీఎం కేసీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని జిల్లాకు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇంచార్జులుగా నియమించి జెడ్పీ పీఠమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన నేపధ్యంలో ప్రతీ ఎంపీటీసీ స్థానం, జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది. దీంతో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడంతో తొలిరోజు అధికార పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. నేటితో నామినేషన్ల ఘట్టం పూర్తికానుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టిక్కెట్ కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలతో తమకే టిక్కెట్ కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారు.

రెండవ రోజు భారీగా నామినేషన్లు..
పరిషత్ ఎన్నికల తొలివిడుతలో బుధవారం నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో రెండవ రోజైన మంగళవారం భారీస్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడుత ఎన్నికలు జరగున్న ఏడు మండలాలకు గాను దుమ్ముగూడెంలో 25, అశ్వాపురంలో 6, చర్లలో 4, టేకులపల్లి 4, పాల్వంచలో 2, ములకలపల్లిలో 6 మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండురోజులకు కలిపి 58 నామినేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దాఖలు కాగా ఏడు జెడ్పీటీసీ స్థానాలకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దుమ్ముగూడెం జెడ్పీటీసీ స్థానానికి 4, అశ్వాపురంలో 2, చర్ల1, టేకులపల్లి1, ములకలపల్లి 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

నేటితో ముగియనున్న ప్రక్రియ
నామినేషన్ల ప్రక్రియ నేటితో పూర్తికానుండడంతో చివరిరోజు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండవరోజైన మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు భారీ స్థాయి లో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలుకానున్నాయి. 25న స్క్రూట్నీ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. 26న అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు చేయవచ్చు. 27న నామినేషన్లలో తప్పులున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. 28వ తేదీన ఉపసంహరణలు, అదే రోజు తుదిజాబితాను ప్రకటిస్తారు. మే 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటి దశ ఎన్నికలు కొనసాగుతాయి.

261
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles