పంచాయతీ బోరుపై ప్రైవేటు వ్యక్తి పెత్తనం

Sat,April 20, 2019 11:57 PM

రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : గ్రామ పంచాయతీ బోరుపై ఓ ప్రైవేటు వ్యక్తి అజమాయిషీ చెలాయిస్తున్నాడు. బోరుకు వేసిన మోటార్ పరికరాలను తీసుకెళ్లి నీటి సరఫరా లేకుండా అడ్డుకున్నాడు. అడిగిన గ్రామస్తులపై దౌర్జాన్యానికి పాత్పడుతున్న సంఘటన మండల పరిధి సూర్యాతండాలో చోటుచేసుకుంది. సూర్యాతండా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి సూర్యాతండా పరిధిలో గల ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీ నిధులతో బోరు నిర్మాణాన్ని చేపట్టారు. చేతి పంపు భిగించడంతో కొంతకాలం గ్రామస్తులు తమ నీటి అవసరాలకు వాడుకున్నారు. కాలక్రమేణా ఆలయ అభివృద్ధిలో భాగంగా బోరుకు ఉన్న చేతి పంపును తొలగించి మోటార్ భిగించారు. ఇందుకు ఆలయాభివృద్ధికి కేటాయించిన కొంత మొత్తాన్ని ఖర్చు చేశారు. ఆలయ నిర్మాణం పనులు పూర్తి అయిన తరువాత నీటి ఎద్దడి దృష్ట్యా గ్రామస్తులంతా ఆ బోరు నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి బోరు మోటార్‌కు ఉన్న విద్యుత్ పరికరాలను, వైర్లను ఎలాంటి సమాచారం లేకుండా తీసుకెళ్లాడు. విషయం తెలిసి ప్రశ్నించిన గ్రామస్తులపై ఎదురుదాడికి తిరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నీటి సరఫరా ఆగిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

264
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles