క్షయ నివారణే లక్ష్యంగా పనిచేయాలి..

Fri,April 19, 2019 11:36 PM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ: క్షయ నివారణే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో టీబీ క్లబ్ సమావేశం జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ క్లబ్ కార్యక్రమం పేరుతో ప్రతీ గ్రామంలో 2025 వరకు క్షయ నివారణే రాష్ట్రమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో టీబీ క్లబ్ వారు అవగహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్లబ్‌లో గ్రామస్థాయిలో 17మంది సభ్యులుంటారని, వీరి ద్వారా సమాచారాన్ని గ్రామ ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆరోగ్య విషయాలను, వసతులను తెలియపరచడం జరుగుతుందన్నారు. కొత్త కేసులు సైతం గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. టీబీ పూర్తిగా కాబడిన పెషెంట్స్ ప్రస్తుతం మందులు వాడుతున్న వ్యాధిగ్రస్తులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నిక్షయ పోషణ్ యోజన పథకం ద్వారా ప్రతి వ్యాధిగ్రస్తునికి నెలకు రూ.500 అకౌంట్‌లో జమవుతున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఉచిత టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. టీబీ అంటువ్యాధి కాదని, జాగ్రత్తలు పాటిస్తే నివారణ జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వందలాది మంది అవగహన లేక క్షయవ్యాధి బారిన పడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కళావతిబాయి, రూరల్ ఎంపీపీ మేళ్లచేర్వు లలిత, పీహెచ్‌సీ డాక్టర్ శ్రీదేవి, హెచ్‌ఈవో శ్రీరాములు, టీబీ నివారణ వైద్యులు జీ.ఉపేందర్, రామక్రిష్ణ, ఇందిర, హెచ్‌వీ పుణ్యావతి, విజయ్‌కుమార్, శ్రీనివాస్, ఆశా వర్కర్లు, టీబీ క్లబ్ మెంబర్లు ఉన్నారు.

పాలేరులో రోగులను పరామర్శించిన కలెక్టర్..
కూసుమంచి: దేశవ్యాప్తంగా 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. కూసుమంచి మండల పరిధిలోని పాలేరులో టీబీ క్లబ్ సభ్యులు, రోగులతో నిర్వహించిన అవేర్‌నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం క్షయ నివారణకు భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో క్షయ రోగులను గుర్తించి, వారికి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఉచితంగా మందులు అందించడమే కాకుండా, నెలకు రూ.500 ఇతర ఖర్చుల కోసం అందిస్తుందన్నారు. ఈ సొమ్ము నెలానెలా సక్రమంగా అందుతుందా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సుమారు 20 మంది రోగులతో కలెక్టర్ మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కలెక్టర్ పుష్పగుచ్ఛం అందించబోగా, తనకు కాదు, రోగులకు ఇవ్వాలంటూ ఓ బాలికకు ఇప్పించారు. ఈ సందర్భంగా పాలేరు సర్పంచ్ యడవల్లి మంగమ్మ, ఎంపీటీసీ గోపె వెంకన్న స్థానిక సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు రూ.20 లక్షలు, గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు, పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కళావతిబాయి, స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

341
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles