ఇంటర్‌లో బాలికలదే హవా..

Fri,April 19, 2019 03:08 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: ఇంటర్ ఫలితాల్లో గత సంవత్సరాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీంతో పాటు రాష్ట్రస్థాయిలో జిల్లాస్థ్ధానం పడిపోయింది. గడిచిన సంవత్సరాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అద్భుత ఫలితాలను సాధిస్తూ, జిల్లాల విభజన అనంతరం అదే ఒరవడిని కొనసాగించారు జిల్లా విద్యార్థులు. ఈ ఫలితాల్లో జిల్లాకు కొంత నిరాశ చెందే ఫలితాలు వచ్చాయి. ప్రథమంలో ఆరో స్థ్ధానం దక్కించుకోగా, ద్వితీయంలో నాల్గో స్థ్ధానాన్ని దక్కించుకుంది. ఉత్తీర్ణత శాతం మూడుశాతం తగ్గింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాకు ఫర్వాలేదనిపించే స్థానం దక్కింది. గత ఫలితాలతో పోల్చిచూస్తే ఫలితాల శాతం తగ్గుతూ స్ధానం పడిపోయింది. ఇంటర్ ప్రథమ ఫలితాల్లో మేడ్చల్, రంగారెడ్డి, కొమ్రంభీం, కరీంనగర్, వరంగల్ అర్బన్ తర్వాత స్థ్ధానాల్లో ఖమ్మం జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా నాల్గో స్థ్ధానంలో నిలిచింది. గత ఏడాది ఫలితాలతో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే కొంత మెరుగైన ఆరో, నాలుగు స్థ్దానాలలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాల నుంచి జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థ్ధానాన్ని కైవసం చేసుకుంటుండగా, ఈ ధపా దానిని కొనసాగించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 2శాతం ఉత్తీర్ణత తగ్గింది. ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత మూడు శాతం తగ్గింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎప్పటిలాగానే బాలికలే తమ హవా కొనసాగించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో సైతం బాలురతో పాటు బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చి సత్తా చాటుకున్నారు. ప్రథమ ఇంటర్‌లో జిల్లా ఉత్తీర్ణత శాతం 65కాగా, అందులో బాలికలు 71శాతం ఉత్తీర్ణతశాతం సాధించగా, బాలురు 59శాతంతో సరిపెట్టుకున్నారు. ద్వితీయంలో 69శాతం సాధించగా, వారిలో బాలికలు 75శాతంతో రాణించగా, బాలురు 61శాతంతో ఆగిపోయారు.

ప్రథమంలో..
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో రెండు శాతం ఉత్తీర్ణత తగ్గించి, జిల్లాస్థానాన్ని ఆరోవ స్థ్ధానానికి పడేశారు. జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 14,534మంది విద్యార్థులకు 9,508మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలోబాలురు 6,837మందికి 4,037మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,697 మందికి 5,471మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, బాలురు 59శాతం, బాలికలు 71శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 2081 మందికి గానూ 1251 మంది ఉత్తీర్ణులై 60శాతం ఫలితాలు సాధించారు. గత సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 67శాతం ఉత్తీర్ణత కాగా, ఈ సంవత్సరం 60శాతంతో 7శాతం తగ్గింది. ఒకేషనల్ విభాగంలో రాష్ట్రస్థ్ధాయిలో జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది. ర్యాంకుల వేటలో ప్రైవేటు కళాశాలలు తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోటీ పడ్డాయి.

ద్వితీయంలో..
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ విభాగంలో 14,317 మంది విద్యార్థులకు 9,885 మంది విద్యార్థుల ఉత్తీర్ణులై 69శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 6689 మందికి 4142 మంది పాసై 61శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల విభాగంలో 7628 మందికి 5743 మంది పాసై 75శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్ విభాగంలో 1039 మంది బాలురకు 734 మంది ఉత్తీర్ణులై 71శాతం నమోదు చేయగా, బాలికలు 875 మందికి 763మంది ఉత్తీర్ణులై 87శాతం సాధించారు. ఒకేషనల్ ద్వితీయంలో రాష్ట్రస్థ్ధాయిలో నాల్గో స్థ్ధానాన్ని సాధించింది.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు..
శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన జీ. సాయి సుప్రజ ఎంపీసీ విభాగంలో 990మార్కులతో రాష్ట్ర స్థ్ధాయిలో ర్యాంక్ , జూనియర్ ఎంపీసీలో శ్రీయ, స్నేహిత, సుష్మలు 466 మార్కులతో, బైపీసీలో కే లహారి 985, కీర్తన -435 మార్కులు సాధించినట్లు కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. కృష్ణవేణి కళాశాలలో ఎంపీసీలో రితిక 991 మార్కులు, బైపీసీలో వర్ష 985 మార్కులతో రాష్ట్రస్థ్ధాయిలో స్థ్ధానం సాధించినట్లు అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. రెజోనెన్స్‌లో లక్ష్మిఖ్యాతి ఎంపీసీ విభాగంలో 986, జశ్మిత 464, బైపీసీలో శ్రీశరణ్య 985, దేవిక-430 మార్కులు సాధించినట్లు కళాశాలల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. న్యూవిజన్‌లో ఎంపీసీలో లక్ష్మితన్మయి 988, సిరిచందన, మేఘన, శ్రేయలు465 మార్కులు సాధించారు. బైపీసీలో కే అన్విత 986, సానియా మహాక్ 433 మార్కులు సాధించినట్లు చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు.

గురుకులాల సత్తా..
జిల్లాలో 14 గురుకుల కళాశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో సత్తా చాటారు. అన్నపురెడ్డి పల్లి, కల్లూరు బాలికల కళాశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. ప్రథమ సంవత్సరంలో 84.3శాతం ఉత్తీర్ణతతో, ద్వితీయ సంవత్సరంలో 89.29శాతం ఉత్తీర్ణతతో రాణించారు. టేకులపల్లి కళాశాలలోని విద్యార్థిని శ్రావణి ఎంపీసీ విభాగంలో 972 మార్కులు సాధించింది. విద్యార్థులను ఆర్‌సీఓ, ఏఆర్‌సీఓ అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో ఠాగూర్‌ప్రభంజనం..
వైరా, నమస్తే తెలంగాణ: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో వైరా ఠాగూర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి ప్రభంజనాన్ని సృష్టించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో షేక్ అజీజ్ 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకును కైవసం చేసుకున్నారు. అదేవిధంగా వి.ప్రకాష్ 958 మార్కులు, కెవిఎన్.చారి 953 మార్కులు, టి.కీర్తి 951 మార్కులు సాధించారు. బైపిసి విభాగంలో పి.ఉషారాణి 971 మార్కులు, బి.సాయితేజ 906 మార్కులు, సీఈసీ విభాగంలో వి.ఆషా 885 మార్కులు, పి.సుస్మిత 884 మార్కులు, హెచ్‌ఈసీ విభాగంలో బి.అనూష 865 మార్కులు, షేక్ రేష్మా 850 మార్కులు సాధించి తమ ప్రతిభను కనబరిచారు.
మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో డి.మానస 446 మార్కులు, ఎం.ధనూష 436 మార్కులు, కె.కుమారి 429 మార్కులు, బైపీసీ విభాగంలో ఎం.అనూష 419 మార్కులు, డి.శివకుమార్ 402 మార్కులు, సీఈసీ విభాగంలో బి.మౌనిక 457 మార్కులు, పి.దివ్య 447 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వైరాలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సంక్రాంతి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో తమ కళాశాల రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం వైరా ప్రాంతానికే గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా, ప్రయోగాత్మకంగా విద్యాబుద్ధులు నేర్పించడం వలనే తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని చెప్పారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు చైర్మన్ సంక్రాంతి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మిఠాయిలు తినిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీహెచ్.క్రిష్ణారావు, రామక్రిష్ణ, రమేష్, లింగారావు, క్రిష్ణ పాల్గొన్నారు.



267
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles