పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం..!

Tue,April 16, 2019 02:27 AM

- ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభం
- మూడు దశల్లో ఎన్నికలు
- ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం చేసిన ఈసీ
- ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు పూర్తి
- ఖమ్మంలో 289 స్థానాలు

మామిళ్లగూడెం, ఏప్రిల్15: జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల ఎన్నికలకు త్వరలో ప్రకటన వెలువడనుంది. అప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు ఎన్నికల పనుల కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు జిల్లాల మండల, జిల్లా ప్రజా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది శిక్షణలు, బ్యాలెట్ పత్రాల ముద్రణలపై పనులను వేగంగా చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తును అధికారులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ కోసం నియమించిన నోడల్ అధికారి ఆ జిల్లాలోని ఎంపీడీవోలతో సమాచారాన్ని సేకరించి అక్కడ జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు ఖమ్మం జిల్లా పరిషత్ అధికారులకు ఎన్నికల నిర్వహాణపై సమాచారాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ పరిషత్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ముసాయిదా ప్రకటనను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్డ్ తేదీలను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా జిల్లా పరిషత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సూత్ర ప్రాయంగా విడుదల చేయడంతో దాదాపు ఆదే తేదీల్లో ఎన్నికలు జరగుతుయనే ప్రచారం జోరందుకుంది.

ఎన్నికల సిబ్బందికి శిక్షణలు ప్రారంభం..
ఖమ్మం జిల్లాలోని 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో ఎన్నికల సిబ్బందికి సోమవారం నుంచి ఎన్నికల నియమావళిపై శిక్షణలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రాలలో ఎంపీడీవోల సారధ్యంలో ఈనెల 15,16,17 తేదీలలో శిక్షణ తరగతులను కొనసాగించనున్నారు. రెండు రోజుల పాటు పీవోలు, ఏపీవోలకు ఆయా మండల కేంద్రాలలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియనిబంధనలపై శిక్షణలలో అవగహన కల్పించనున్నారు. 17వ తేదీన రిటర్నింగ్ అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల నియమనిబంధనలకు సంబంధించిన కరదీపికలను ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరడంతో వాటిని మండల కేంద్రాలకు పంపించనున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌ల ఎంపిక జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించేందుకు పీవోలు, ఏపీవోలుగా 3850 మంది సిబ్బందిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2408 మంది పీఓలు, ఏపీవోలుగా నియమించి వారికి ఉత్తర్వులను సైతం జారీ చేశారు.

మూడు దశల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు..
ఖమ్మం జిల్లాలో 20 మండలాలకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదాను సిద్ధం చేసింది. ఎన్నికల సంఘం సిద్ధం చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి దశ..
ఈనెల 22 నుంచి నామినేషన్ల ప్రక్రియను మొదటి దశ ఎన్నికలను ప్రారంభించనున్నారు. 24న మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ముగుస్తాయి. 25న స్క్రూట్నీ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. 26న ఫిర్యాదులు స్వీకరిస్తారు. 27న నామినేషన్లలో తప్పులున్న, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. 28న ఉపసంహరణ పత్రాలు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం తుది జాబితా ప్రకటిస్తారు. మే 6వ తేదీన మొదటి దశ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. మొదటి దశలో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమాలయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి మండలాలు, భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో అశ్వాపురం, బుర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండవ దశలో..
ఈ నెల 26 నుంచి నామినేషన్ల ప్రక్రియను రెండవ దశ ఎన్నికలను ప్రారంభించనున్నారు. 28న రెండవ దశ ఎన్నికల నామినేషన్లు ముగుస్తాయి. 29న స్క్రూట్నీ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. 30న ఫిర్యాదులు స్వీకరిస్తారు. మే1వ తేదీన నామినేషన్లలో తప్పులున్న, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. మే 2వ తేదీన ఉపసంహరణ పత్రాలు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం తుది జాబితా ప్రకటిస్తారు. మే 10వ తేదీన రెండవ దశ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. రెండవ దశలో ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం, మణుగూరు, పినపాక, అన్నపురెడ్డిపల్లి, అశ్వారరావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, జులూరుపాడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మూడవ దశలో...
మే 30 వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియను మూడవ దశ ఎన్నికలను ప్రారంభించనున్నారు. మే 2వ తేదీన మూడవ దశ ఎన్నికల నామినేషన్లు ముగుస్తాయి. మే3న స్క్రూట్నీ అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు. మే 4న ఫిర్యాదులు స్వీకరిస్తారు. మే 5 వ తేదీన నామినేషన్లలో తప్పులున్న, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. మే 6వ తేదీన ఉపసంహరణ పత్రాలు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం తుది జాబితా ప్రకటిస్తారు. మే 14వ తేదీన రెండవ దశ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రకటించే అవకాశం ఉంది. మూడవ దశలో ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి, చుంచుపల్లి, గుండాల, లక్ష్మీదేవులపల్లి, సుజాతనగర్, ఇల్లందు మండలాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు పూర్తి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియలను పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో 289 ఎంపీటీసీ స్థానాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాలలో 220 ఎంపీటీసీ స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 ఎంపీపీలు, జడ్పీటీసీల స్థానాలకు రిజర్వేషన్లను పూర్తి చేశారు. ఈ రిజర్వేషన్‌ల ప్రక్రియను మండలాలకు మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనిలు కసరత్తును పూర్తి చేసి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి అనుమతులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియలను కమిషనర్ పూర్తి చేసి ప్రభుత్వ అనుమతులను పొందిన తరువాత అన్ని రిజర్వేషన్లను గెజిట్ ద్వారా ప్రకటించారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల ఎంపిక, ప్రతి ఎంపీటీసీ స్థానానికి 400కు తక్కువ కాకుండా ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, మరికొన్ని 600ల పైన ఓటర్లు ఉన్న వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ అధికారులు కొనసాగిస్తున్నారు.

313
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles