పరిషత్ ఎన్నికల ఇన్‌చార్జ్జిగా రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి

Tue,April 16, 2019 02:26 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో జిల్లా, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఖమ్మం జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూల శ్రవణ్‌కుమార్‌రెడ్డిని నియమిస్తూ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలకు పరిషత్ ఎన్నికల పరిశీలకుల నియామకం చేశారు. జిల్లాలో 20 ఎంపీపీ, 20 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు నడిపించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ముందుగానే కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 20 మండల పరిషత్ చైర్మన్‌లు, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే విధంగా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, ఇతర కార్పొరేషన్ చైర్మన్‌లు జిల్లా స్థాయి నాయకులను ఈ ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు.

టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలతో జిల్లాలో నాయకులను పరిషత్ ఎన్నికలకు శ్రవణ్‌కుమార్‌రెడ్డి సంసిద్ధులను చేయనున్నారు. రెండు రోజుల్లో జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లాలో జడ్పీటీసీ టికెట్ల కేటాయింపు, ఎంపీపీల నియామకం, గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు, జడ్పీటీసీ స్థానాలకు అర్హులైన, ప్రజా బలమున్న టీఆర్‌ఎస్ నాయకులను పోటీలో దించేందుకు స్థానిక నాయకత్వంతో కలిసి సమన్వయంగా పని చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీగా పనిచేసి మంచి ఫలితాలను సాధించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా అనుసరించి ఫలితాలు సాధించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో శ్రవణ్‌కుమార్‌రెడ్డి సేవలను ఖమ్మం జిల్లాలో పరిషత్ ఎన్నికలకు వినియోగించుకోవాలని భావించిన పార్టీ అధినాయకత్వం ఖమ్మం జిల్లాకు నియమించింది. త్వరలోనే జిల్లాలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సమరంలోకి టీఆర్‌ఎస్ శ్రేణులను దించనున్నారు.

230
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles